బంగాళాఖాతంలో ఆవర్తనం- ఏపీలో వర్షాలు
Bay of Bengal: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన వాతావరణం వల్ల ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఉత్తరాంధ్ర సహా, ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
బంగాళాఖాతం ఉత్తర ప్రాంతానికి ఆనుకుని బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది బలపడి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరుగా వర్షాలు పడుతున్నాయి. చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది.

ఈ సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కర్నూలు, తిరుపతి, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
నెల్లూరు జిల్లా ఉత్తర ప్రాంతం- ప్రధానంగా ఆత్మకూరు- నెల్లూరు- కావలి ప్రాంతాల్లో గురువారం తెల్లవారు జామున ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి.
రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
మిగలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన వెల్లడించారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు హోర్డింగులు, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి ప్రదేశాల వద్ద నిల్చోకూడదని విజ్ఞప్తి చేసింది విపత్తు నిర్వహణ సంస్థ.












Click it and Unblock the Notifications