విభిన్న వాతావరణం, అటు వడగాల్పులు - ఇటు వర్షాలు.. తాజా హెచ్చరికలు..!!
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనూహ్యంగా మారుతోంది. విభిన్న పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో వడగాల్పులు ఉంటే.. మరి కొన్ని జిల్లాలకు వర్షం ముప్పు పొంచి ఉంది. పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం పూట ఎండలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయి. ఇదే సమయంలో పలు జిల్లాల్లో రానున్న రెండు రోజులు పిడుగులు.. ఈదురు గాలులతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా హెచ్చరికలు జారీ అయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బయట తిరగాలటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వడగాడ్పుల కారణంగా జనం అస్వస్థతకు గురవుతున్నారు. మండే ఎండలతో అల్లాడిపోతున్న వేళ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి, ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శని, ఆది సోమవారాల్లో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, సంగారెడ్డి, వరంగల్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు
అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇక, శనివారం 73 మండలాల్లో తీవ్రవడగాలులు, 17 మండలాల్లో వడగాలులు, ఆదివారం 32 మండలాల్లో తీవ్రవడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీస్తాయని తాజాగా వెల్లడించారు. ఎండ తీవ్రత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. రేపు శ్రీకాకుళం జిల్లాలో 16, విజయనగరం 24, పార్వతీపురంమన్యం 15, అల్లూరి 3, పోలవరం 9, అనకాపల్లి 2, కాకినాడ 3, తూర్పుగోదావరి 1 మండలాల్లో తీవ్రవడగాలులు(73) వీచే అవకాశం ఉందని చెప్పారు. అలాగే శ్రీకాకుళం 2, పోలవరం 2, అనకాపల్లి 1, కాకినాడ 2, తూర్పుగోదావరి 3, ఏలూరు 4, ఎన్టీఆర్ 1, పల్నాడు 2 మండలాల్లో వడగాలులు(17) ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. శనివారం మన్యం(జి) భామినిలో 41.8°C, చిత్తూరు(జి) రాయలపేట లో 41.4°C, అనకాపల్లి(జి) నాతవరంలో 40.9°C, శ్రీకాకుళం(జి) జి.సిగడాంలో 40.5°C, నంద్యాల (జి) ఆలమూరు, కడప(జి) బద్వేల్ లో 40.4°C, ఏలూరు(జి) ధర్మాజీగూడెం, తిరుపతి(జి) రేణిగుంట, విజయనగరం(జి) రాజాంలో 40.3°C, కృష్ణా(జి) కంకిపాడులో 40.1°C, కర్నూలు(జి) తోవి 40°C చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications