బంగాళాఖాతంపై మరింత విస్తరించిన ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు
నడివేసవిలో ఏపీని వర్షాలు పలకరిస్తోన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. నిన్నటివరకు ఉత్తరాంధ్ర మొదలుకుని రాయలసీమ వరకూ పలు చోట్ల చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఎండ వేడి నుంచి కొంత ఉపశమనాన్ని కలిగించినప్పటికీ- రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. వర్షాలు క్రమంగా తగ్గి, ఎండ తీవ్రత రెట్టింపు అవుతుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రత్యేకించి అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని తర్వాత క్రమంగా ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం, దీనితోపాటుగా ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని వివరించారు. ముసురు వాతావరణంతో పాటుగా పిడుగులతో కూడిన వర్షాలు పడేందుకు అవకాశం ఉందని అన్నారు. నేడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడల్లో అక్కడక్కడ జల్లులు కురుస్తాయని చెప్పారు.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసేటపుడు పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు చెట్ల కింద నిలబడరాదని చెప్పారు. పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించారు. సురక్షితమైన భవనాల్లో తలదాచుకోవాలని అన్నారు.












Click it and Unblock the Notifications