పూరి జగన్నాథ్ రథయాత్ర కు ప్రత్యేక బస్సులు, 4 రోజుల్లో ఏడు క్షేత్రాలు - ప్యాకేజీ ఇలా..!!
పూరీ జగన్నాథ్ రథయాత్ర కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రకటించింది. ప్రయాణీకుల కోసం పూరీతో పాటుగా నాలుగు రోజుల్లో ఏడు క్షేత్రాలను దర్శించుకునేలా ప్యాకేజీ ప్రకటించింది. ధరల వివరాలను వెల్లడించింది. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ బస్సులు ప్రారంభం కానున్నాయి. కాగా, పూరీ జగన్నాథ్ రథ యాత్ర కోసం దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ఏపీ నుంచి వచ్చే భక్తుల కోసం ఈ నిర్ణయం తీసుకున్న ఆర్టీసీ వెల్లడించింది.
ఒడిశాలోని పూరి జగన్నాథ్ రథయాత్రకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసారు. ఈ నెల 25న సాయంత్రం 5 గంటలకు బయలు దేరుతాయి. నాలుగు రోజులపాటు సాగే యాత్రలో భాగంగా భక్తులు ఏడు పుణ్యక్షేత్రాలను దర్శించు కునేలా ప్యాకేజీ ఖరారు చేసారు. ఈ రథయాత్ర కోసం పుష్‌బ్యాక్ 2 ప్లస్ 2 సీట్లు, టీవీ సౌకర్యం ఉన్న సూపర్ లగ్జరీ బస్సును సిద్ధం చేస్తున్నట్ అధికారులు వెల్లడించారు. భక్తుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇలా ఎన్ని బస్సులైనా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసారు. డిమాండ్ ఉన్న ప్రాంతాల నుంచి బస్సులు నడపనున్నారు.

పూరి జగన్నాథ్ రథయాత్రకు బయలుదేరే భక్తులు ఏడు క్షేత్రాల్లో ఆలయాలను దర్శించుకునే అవకాశం కల్పించారు. సింహాచలంలో వరాహలక్ష్మీనరసింహస్వామి, అరసవిల్లిలో సూర్యభగవాన్, శ్రీకూర్మంలో కూర్మనాథస్వామి, భువనేశ్వర్‌లో లింగరాజుస్వామి, సాక్షిగోపాల్‌లో వేణుగోపాల స్వామి, కోణార్క్, పూరిలో జగన్నాథ స్వామి ఆలయాలను దర్శించుకునేలా రూట్ ఖరారు చేసారు. కాగా, ఒక్కొక్కరికీ టికెట్ ధర రూ.3,500గా నిర్ణయించారు. అల్పాహారం, టీ, భోజనం ఇతర ఖర్చులు భక్తులే భరించాలి. మార్గమధ్యలో విశ్రాంతి గదులు తీసుకోవాలనుకుంటే అందుకయ్యే ఖర్చు కూడా భక్తులే భరించాల్సి ఉంటుంది. భక్తులు బస్సు టికెట్ల బుకింగ్, ఇతర సమాచారం కోసం డిపో అసిస్టెంట్ మేనేజర్ 73829 12141, స్టేషన్ మేనేజర్ 95023 00189 ఫోన్ నంబర్లలో సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.












Click it and Unblock the Notifications