సంక్రాంతి వేళ టికెట్ ధరల పై APSRTC గుడ్ న్యూస్..!!
సంక్రాంతి వేళ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో సొంత ఊర్లకు వెళ్లే వారితో పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగుతాయి. ఇప్పటికే పండుగ రద్దీ కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. వాటిల్లోనూ రిజర్వేషన్లు ఫుల్ అయ్యాయి. తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను ప్రకటించింది. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ సైతం పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ చేస్తోంది. టికెట్ ధరల పైనా కీలక నిర్ణయం తీసుకుంది.
సంక్రాంతి వేళ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య భారీగా రాకపోకలు సాగనున్నాయి. ఇందు కోసం ఇప్పటికే రైల్వే శాఖ 600 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తెలంగాణ ఆర్టీసీ 1200 వరకు స్పెషల్ బస్సులను ఏపీలోని పలు ప్రాంతాలకు కేటాయించింది. ఇక.. ఏపీఎస్ఆర్టీసీ సైతం విజయవాడ, విశాఖ, తిరుపతి నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందు లో భాగంగా కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో 596 ప్రత్యేక బస్సులు తిరగనున్నాయి. విజయవాడ, మచిలీపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులతో పాటు రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చే బస్సుల పై ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. జనవరి 8 నుంచి 14 వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. పండుగ తరువాత 17వ తేదీ నుంచి 19 వరకు ఈ ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. కాగా.. హైదరాబాద్ నుంచే ఎక్కువ మంది పండుగ వేళ ఏపీకి వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రతీ ఏటా స్పెషల్ బస్సుల వేళ ఆర్టీసీ అదనపు వసూళ్లు చేసేది. ఈ సారి స్పెషల్ బస్సులకు అదనసు ఛార్జీలు ఉండవని ఆర్టీసీ ఛైర్మన్ ప్రకటించారు.

దీంతో, విజయవాడ-హైదరాబాద్, మచిలీపట్నం-హైదరాబాద్ మధ్య 29 ప్రత్యేక బస్సులు సైతం కేటాయించారు. గత ఏడాదిలో అయితే మచిలీపట్నం నుంచే 70 ప్రత్యేక బస్సులు నడిచాయి. విజయవాడ నుంచి 100 పైగా తిరిగాయి. ప్రస్తుతం స్త్రీ శక్తి పథకం అమలు కారణంగా ప్రత్యేక బస్సుల కేటాయింపు పైన ప్రభావం పడనుంది. ప్రత్యేక బస్సుల్లో స్త్రీశక్తి పథకం అమలు పైనా అధికారులు చర్చిస్తున్నారు. అటు ప్రయివేటు ట్రావెల్స్ సైతం ఇప్పటికే పండుగ రద్దీని సొమ్ము చేసుకోవటం ప్రారంభించారు. అదే విధంగా చెన్నై, బెంగళూరు సర్వీసులపైనా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. డిమాండ్ కు అనుగుణంగా సర్వీసుల కేటాయింపు పైన నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి పెద్ద సంఖ్యలో వచ్చే ప్రయాణీకులతో తెలంగాణ ఆర్టీసీ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వస్తున్నాయి. తిరుగు ప్రయాణంలో రద్దీ తగ్గే అవకాశం కనిపిస్తోంది. దీంతో, రాను పోను టికెట్ల బుకింగ్ ధరల పైన రాయితీ అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications