అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్.. భూమిపూజకి టైమ్ ఫిక్స్ ? చీఫ్ గెస్ట్ ఎవరంటే ?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణపనులు శరవేగంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దీనిపైనే ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పుడు రాజధానిలో వైద్య రంగానికి సంబంధించి మరొక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది.
బసవతారకం హాస్పిటల్ భూమిపూజ..
ఆగస్టు 13న అమరావతిలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి భూమిపూజ చేయనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు.. హాస్పిటల్ చైర్మన్, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. ఈ మేరకు ఆయన సన్నిహితులు గాంధీ, సిద్ధాంతి నాగమల్లేశ్వరరావు లతో కలిసి స్వయంగా స్థలాన్ని పరిశీలించారు.

మూడు దశల్లో నిర్మాణం..
ఈ ఆసుపత్రి ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని బాలయ్య అన్నారు. 21 ఎకరాల విస్తీర్ణంలో మూడు దశల్లో ఈ ఆసుపత్రి నిర్మాణం జరగనుందని స్పష్టం చేశారు. తొలి దశలో క్యాన్సర్ నిర్ధారణ, డే కేర్ విభాగాలు ప్రారంభమవుతాయని తెలిపారు. రెండో దశలో కిమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ విభాగాలు.. మూడో దశలో పరిశోధన, శిక్షణ, అంతర్జాతీయ చికిత్స విభాగాలను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ఈ ఆసుపత్రి ప్రైవేట్-పబ్లిక్ భాగస్వామ్యంతో ఒక సేవా కేంద్రంగా పనిచేస్తుందని చెప్పుకొచ్చారు.
అమరావతి ఒక ప్లాన్డ్ క్యాపిటల్ సిటీ అని.. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థలు, ఐటీ పార్కులను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. బసవతారకం ఆసుపత్రి రాకతో అమరావతి ఆరోగ్య రంగంలో కూడా ఒక ప్రముఖ కేంద్రంగా మారనుందని హర్షం వ్యక్తం చేశారు.

అలానే ఇటీవల 'భగవంత్ కేసరి' చిత్రానికి తెలుగులో జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు లభించడంపై బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. సమాజానికి ఉపయోగపడే చిత్రాలు తీయడానికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. కమర్షియల్ చిత్రాలతో పాటు, ప్రజలలో సామాజిక అవగాహన పెంచే కథలను ఎంచుకుంటానని అన్నారు.
మరోవైపు తన నియోజకవర్గమైన హిందూపురంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి కూడా బాలయ్య మాట్లాడారు. ఇండస్ట్రియల్ పార్కులు, అంతర్రాష్ట్ర రహదారుల నిర్మాణం, విద్యా సహా పలు రంగాల్లో కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.












Click it and Unblock the Notifications