విడినా ఒక్కటి, అయినా గెలవడం..: బాలకృష్ణ, తడబాటు
హైదరాబాద్: హీరో, హిందూపురం తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ బుధవారం మహానాడులో కాస్త తడబడుతూ మాట్లాడారు. తెలుగు జాతి భౌగోళికంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయినా అందరం ఒక్కటే అన్నారు. భవిష్యత్తులో తెలంగాణలోను టిడిపి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ తెలుగు జాతిలో పుట్టడం మన అదృష్టమన్నారు. ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడు కొండను పొట్టేలు ఢీకొంటుందని, కాంగ్రెసు పార్టీని ఎన్టీఆర్ ఢీకొనడమా.. అంటూ చాలామంది పెదవి విరిచారన్నారు. కానీ పార్టీని స్థాపించి ఆయన అధికారంలోకి తీసుకు వచ్చారని చెప్పారు.

ఎన్టీఆర్ నవతరం నాయకులకు మార్గం చూపిన వ్యక్తి అన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఓ శకం ప్రారంభమైందన్నారు. భౌగోళికంగా తెలుగు జాతి విడిపోయినా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అన్నారు. ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు.
పదేళ్లు పార్టీ అధికారంలోకి లేకపోయినప్పటికీ కార్యకర్తలు పార్టీని కాపాడారన్నారు. అందుకు వారికి తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడేందుకే ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని చెప్పారు. ఆయన తన హయాంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు.
ప్రజలు చంద్రబాబు పాలన పైన నమ్మకం ఉంచి గెలిపించారన్నారు. ప్రాంతీయ పార్టీ ప్రతిపక్షంలో పదేళ్లు ఉంటూ ఇలా మళ్లీ అధికారంలోకి రావడం మామూలు విషయం కాదన్నరు. చంద్రబాబుపై విశ్వాసంతోనే గెలిపించారన్నారు. టిడిపికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. మోడీ, చంద్రబాబు నాయకత్వంలో ఎపిని అభివృద్ధి చేసుకుందామన్నారు. తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలన్నారు.
మీరెవరని తనను ఎవరైనా అడిగితే.. మొదట భారతీయుడనని, తర్వాత తెలుగువాడినని, ఆ తర్వాత ఎన్టీఆర్ తనయుడినని, ఇంకా అడిగితే అన్నగారి అభిమానిని అని చెబుతానని తెలిపారు. ఎన్టీఆర్ అంటే ఓ వ్యక్తి కాదన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి ముఖ్యమన్నారు.












Click it and Unblock the Notifications