బెంగళూరు రేవ్ పార్టీ: దమ్ముంటే బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం రా.. సోమిరెడ్డికి కాకాణి సవాల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెంగళూరు రేవ్ పార్టీ ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంపై నెల్లూరుజిల్లా నేతలు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. బెంగళూరు రేవ్ పార్టీ అంశంలో తెలుగుదేశం నేతలు చేస్తున్న విమర్శలకు రియాక్ట్ అయిన కాకాణి గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సోమిరెడ్డికి కాకాణి సవాల్
బెంగళూరు రేవ్ పార్టీతో తనకు సంబంధం ఉందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని.. బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం దమ్ముంటే రావాలంటూ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డి కి సవాల్ విసిరారు. బెంగళూరు రేవ్ పార్టీ దగ్గర ఉన్న కారు తన కారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిరూపించగలరా అంటూ ఛాలెంజ్ చేశారు.

దమ్ముంటే నిరూపించు సోమిరెడ్డి
నా ఆధ్వర్యంలోనే పార్టీ జరిగిందని, నా పాస్పోర్ట్ దొరికిందని, గోపాల్ రెడ్డి నాకు సన్నిహితుడని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెబుతున్నాడని, దమ్ముంటే నిరూపించాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. నా పాస్పోర్ట్ నా దగ్గరే ఉందని, కారులో దొరికిందని చెబుతున్న పాస్పోర్ట్ ఎవరి దగ్గర ఉందో చెప్పాలన్నారు. అది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గర ఉందా.. లేక బెంగళూరు పోలీసుల దగ్గర ఉందా అంటూ ఎద్దేవా చేశారు .
ఏ ఆధారం ఉన్నా బయటపెట్టాలి
బెంగళూరు రేవ్ పార్టీ వద్ద ఉన్న కారుతో తనకు సంబంధం ఉందని చెబుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దానిని రుజువు చేయగలరా అంటూ ప్రశ్నించారు. ఆ కారు తుమ్మల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పేరుతో ఉందని, కారుకు స్టికర్ ఉందని అంతమాత్రాన నా కారు అవుతుందా అంటూ ప్రశ్నించారు. గోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని, అతనితో తనకు పరిచయం ఉన్నట్టు ఏ ఆధారం ఉన్నా బయట పెట్టాలన్నారు.
బ్లడ్ శాంపిల్స్ ఇవ్వటానికి తానురెడీ అన్న కాకాణి
క్లబ్బుకు వెళ్లడం, పేకాట ఆడటం డ్రగ్స్ తీసుకోవడం వంటి అలవాట్లు ఎవరికి ఉన్నాయో తేల్చుకుందాం రమ్మని ఛాలెంజ్ చేశారు. బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి తాను రెడీగా ఉన్నానని.. దమ్ముంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా రావాలన్నారు. రాజకీయాలను రాజకీయంగానే తేల్చుకోవాలి కాని వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని కాకాణి గోవర్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
సోమిరెడ్డిపై కాకాణి ఆరోపణలు
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లో చాలా చీకటి కోణాలు ఉన్నాయని పురాతన పంచలోహ విగ్రహాలను విదేశాలకు అమ్మేందుకు ఆయన ప్రయత్నించారని ఆరోపించారు . సోమిరెడ్డి పై తాను చేసే ఆరోపణలు అన్ని నిజాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి బల్ల గుద్ది మరీ చెప్పారు.












Click it and Unblock the Notifications