టీటీడీ అక్రమాలపై చంద్రబాబు, పవన్ కు చెబుతాం, వైసీపీ పాలనలో? రెడ్డి ఫైర్
గత ఐదు ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయామంలో తిరుమలను అధర్మక్షేత్రంగా మార్చేశారని, ఐదేళ్లలో తిరుమలలో భారీగా అవినీతి చోటు చేసుకుందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తిరుమలలో మీడియాతో మాట్లాడిన బీజేపీ నాయకుడు గాలి భానుప్రకాష్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వం మీద పలు ఆరోపణలు చేశారు.
గత ఐదు ఏళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లోని అన్ని విభాగాలలో భారీగా అవినీతి చోటుచేసుకుందని, ఇంజనీరింగ్ పనుల్లో 15 శాతం కమీషన్లు తీసుకున్నారని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు ఫిర్యాదు చేసి విచారణ జరిపించాలని మనవి చేస్తామని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి అన్నారు.

శ్రీవారి ఆభరణాలపై కూడా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనవి చేస్తామని, భానుప్రకాష్ రెడ్డి చెప్పారు. శ్రీవారి ఆభరణాలపై కూడా భక్తులకు అనేక అనుమానాలు ఉన్నాయని, ఇప్పటికే అనేకసార్లు భక్తులు ఇలాంటి ఆరోపణలు చేశారని బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి గుర్తు చేశారు. ఇన్ని ఆరోపణలు వచ్చినా అప్పటి వైసీపీ ప్రభుత్వం భక్తులకు ఎలాంటి వివరణ ఇవ్వలేదని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
తిరుమలలో ఇంత అవనీతి జరుగుతున్నా టీటీడీ విజిలెన్స్ అధికారులు మాత్రం ఒక్క కేసు కూడా నమోదు చెయ్యలేదని, వైసీపీ పెద్దలు ఆడినట్లు విజిలెన్స్ అధికారులు ఆడారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ అధికారులు విచారణకు వస్తే టీటీడీ అధికారులు సహకరించడానికి నిరాకరించారని, అంటే అవినీతి జరిగింది అని వాళ్లు పరోక్షంగా అంగీకరించారా ? అని భానుప్రకాష్ రెడ్డి టీటీడీ అధికారులను ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం పతనం అయినా ఇప్పటికే కొందరు టీటీడీ అధికారులు ఆ పార్టీ నాయకుల జపం చేస్తున్నారని, ఇలాంటి వారికి శ్రీవెంకటేశ్వరస్వామి తగిన బుద్ది చెబుతాడని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో టీటీడీలో అక్రమాలను పాల్పడిన వారు ఎలాంటి పరిస్థితుల్లో తప్పించుకోలేరని, చట్టంలోని లొసుగులతో వాళ్లు తప్పించుకున్నా స్వామివారి శిక్ష నుంచి ఏమాత్రం తప్పించుకోలేరు అని వాళ్లు గుర్తు పెట్టుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications