33 ఏళ్ల వైరానికి ముగింపు - ఒక్కటైన భూమా, ఇరిగెల వర్గాలు..!!
ఏపీ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పొత్తులో భాగంగా మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. పార్టీలతో పాటుగా దశాబ్దాల కాలంగా వైరం తో సాగిన నేతలు ఒక్కటి అవుతున్నారు. కర్నూలు జిల్లాలో 33 ఏళ్ళ తరువాత భూమా - ఇరిగెల వర్గాలు కలిసాయి. రెండు వర్గాలతో చర్చలు జరిపి ఒక్కటి చేయటంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఎన్నికల వేళ ఈ పరిణామం ఆసక్తి కరంగా మారుతోంది.
దశాబ్దాల వైరం
నంధ్యాల జిల్లా ఆళ్లగడ్డలో దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్దులుగా ఉన్న భూమా - ఇరిగెల వర్గాలు కలిసి కట్టుగా ముందుకు వెళ్లనున్నాయి. బైరెడ్డి రాజశేఖర రెడ్డి నివాసంలో భూమా అఖిల ప్రియ - జనసేన నేత ఇరిగెల రాం పుల్లారెడ్డి మధ్య సయోధ్య కుదిరింది. త్వరలోనే ఈ రెండు వర్గాలకు చెందిన నేతలు ఆళ్లగడ్డలో ఉమ్మడి సమావేశం నిర్వహించి ఎన్నికల్లో గెలుపు దిశగా కార్యాచరణ ప్రకటించేందుకు సిద్దం అయ్యారు. దశాబ్దాలుగా ఈ రెండు వర్గాల మధ్య ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచేవి.

ఒక్కటైన రెండు వర్గాలు
రెండు వర్గాలు దాడులు, ప్రతి దాడులకు దిగేవి. 1991లో ఆళ్లగడ్డ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్దిగా పోటీలో నిలిచిన భూమా నాగిరెడ్డికి ఇరిగెల వర్గం మద్దతు ప్రకటించింది. తరువాత కాలంలో వారు విడిపోయారు. అప్పటి నుంచి ఇరిగెల రాంపుల్లారెడ్డి మూడు సార్లు భూమా కుటుంబానికి వ్యతిరేకంగా అసెంబ్లీ బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో ఇరిగెల వర్గం వైసీపీ అభ్యర్ది బిజేంద్రరెడ్డికి మద్దతు ప్రకటించింది. ఆ ఎన్నికల తరువాత ఇరిగెల వర్గం గంగుల వర్గానికి దూరంగా ఉంటూ వచ్చింది.
ఎన్నికల్లో సహకారం
కొద్ది నెలల క్రితం ఇరిగెల సోదరులు జనసేనాని పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయాలని భావించారు. తమకు సీటు ఇవ్వాలని పవన్ ను కోరారు. అయితే, కూటమి నిర్ణయంలో భాగంగా ఆళ్లగడ్డ సీటు టీడీపీ నుంచి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు దక్కింది. దీంతో, బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ రెండు వర్గాలను దగ్గర చేసేందుకు పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు. తాజాగా ఆయన నివాసంలో జరిగిన కీలక భేటీలో కలిసి పని చేసేందుకు రెండు వర్గాలు అంగీరించాయి.












Click it and Unblock the Notifications