టిడిపితో కలిసి వెళ్లాలని బిజెపి, నానికి పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్య ఎఫెక్ట్
హైదరాబాద్/రాజమండ్రి: ఏపీలో నామినేటెడ్ పోస్టుల విషయంలో టిడిపితో సమన్వయంతో ముందుకెళ్లాలని బిజెపి నిర్ణయించింది. కమిటీలో పార్టీ తరఫున సభ్యుల నియామాకం అంశం జాతీయ అధ్యక్షులు అమిత్ షా దృష్టికి వెళ్లింది. ఈ నెల 9న ఢిల్లీలో జరిగే సమావేశంలో ఈ విషయంపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది.
అదేవిధంగా ఏపీలో బీజేపీ బలోపేతం, పార్టీకి సంబంధించి నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించనుంది. అమిత్ షా సమక్షంలో జరిగే ఈ భేటీకి రాష్ట్రం నుంచి బిజేపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనాయకులు హాజరవుతారు.
ఏపీ ప్రభుత్వంలో భాగస్వామ్యపక్షంగా ఉన్నందున బిజెపి నేతలకూ నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే టీడీపీని కోరింది. నాయకుల పేర్లతో కూడిన జాబితాను అందించింది. టీడీపీ సానుకూలంగా స్పందించింది.

రెండు పార్టీల నుంచి ముగ్గురేసి సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించింది. ఈ విషయాన్ని ఇటీవల బెంగళూరులో జరిగిన బిజెపి సమావేశంలో అమిత్ షా దృష్టికి తీసుకు వెళ్లారు. మరికొందరు నాయకులకు నామినేటెడ్ పదవులు దక్కేలా చూడాలని ఏపీ బిజెపి నేతలు కోరారు.
నాని దిష్టిబొమ్మ దగ్ధం చేసిన జనసేన
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని నందంగనిరాజు జంక్షన్‌లో జనసేన పార్టీ కార్యకర్తలు విజయవాడ ఎంపీ కేశినేని నాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తమ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వారు దగ్ధం చేశారు.
ఆరు ప్రాజెక్టులు ప్రారంభిస్తాం: దేవినేని
వచ్చే ఏడాది ఆరు ప్రాజెక్టులు ప్రారంభిస్తామని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు బుధవారం చెప్పారు. గోదావరి, కృష్ణా వరద నీటిని సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. ఆగస్టు 15 నాటికి పట్టిసీమను పూర్తి చేస్తామని చెప్పారు. ఆయన నరసాపురంలో పుష్కర ఘాట్లను పరిశీలించారు.












Click it and Unblock the Notifications