పొత్తు వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్ - కమలం అభ్యర్దులు సిద్దం, ఎవరెక్కడ..!!
ఏపీలో పొత్తుల నిర్ణయం పై ఉత్కంఠ కొనసాగుతోంది. టీడీపీ, జనసేన కలిసే ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. బీజేపీ తమ కూటమితో కలుస్తుందని చెబుతున్నా..ఇంకా స్పష్టత రాలేదు. ఈ సందిగ్ధం కొనసాగు తుండగానే రాష్ట్ర బీజేపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఎవరెక్కడ పోటీకి దిగాలనే అంశం పైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఎంపీ అభ్యర్దుల జాబితా సిద్ధం చేసి పార్టీ అధిష్ఠానానికి పంపుతున్నారు. దీంతో, బీజేపీ నిర్ణయం ఏంటనేది సస్పెన్స్ గా మారుతోంది.
బీజేపీ కీలక అడుగులు: ఏపీలో పొత్తుల పైన స్పష్టత ఇవ్వకుండానే బీజేపీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మొత్తం 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్దుల జాబితా సిద్దం చేస్తోంది. పోటీకి దచ్చిన దరఖాస్తులను పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్, రాష్ట్ర సంఘటనా మంత్రి మధుకర్‌తో కూడిన బృందం పరిశీలించింది.

రాయలసీమ, ఉత్తరాంధ్రతోపాటు గుంటూరు, బాపట్ల పార్లమెంటు పరిధిలోని అభ్యర్థుల బలా బలాలపై స్ర్కీనింగ్ కమిటీ బేరీజు వేసింది. అభ్యర్థుల దరఖాస్తుల వడపోత జరిగింది. క్షేత్రస్థాయి బలం, ఆర్థిక పుష్టి, పార్టీలో సానుకూలత తదితర అంశాలపై క్షుణ్నంగా పరిశీలించి ప్రతి అసెంబ్లీకి ముగ్గురి చొప్పున జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. పార్టీ అధినాయకత్వం అనుమతితో అభ్యర్దులను ప్రకటించేందుకు సిద్దమవుతోంది.
ఎవరెక్కడ పోటీ: మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి - జమ్మలమడుగు, తిరుపతి - భానుప్రకాశ్, శ్రీకాళహస్తి - కోలా ఆనంద్, రాజంపేట - సాయి లోకేశ్, చిత్తూరు - జగదీశ్వర నాయుడు, ధర్మవరం - వరదాపురం సూరి, గుంతకల్ - సందిరెడ్డి శ్రీనివాస రెడ్డి, నంద్యాల - బైరెడ్డి శబరి, గుంటూరు పశ్చిమం - వల్లూరు జయప్రకాశ్ పేర్లు ఖాయం చేసినట్లు తెలుస్తోంది.
ఎచ్చెర్ల - రమ్య దొనేపూడి, అరకు - పాంగి రాజారావు, విశాఖపట్నం నార్త్ -విష్ణుకుమార్ రాజు పేర్లు ఖరారు జాబితాలో ఉన్నాయి. పార్లమెంటు స్థానాల్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి - రాజంపేట, సత్య కుమార్ - హిందూపురం, సీఎం రమేశ్ - విశాఖపట్నం, సుజనా చౌదరి - విజయవాడ , అరకు - కొత్తపల్లి గీత పేర్లకు ఆమోదం లభించటం ఖాయంగా కనిపిస్తోంది.
పొత్తు ఉన్నట్లా - లేనట్లా: కసరత్తులో భాగంగా ఈ రోజు (ఆదివారం) నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థుల పేర్లు పరిశీలించి తుది జాబితా సిద్ధం చేసి పార్టీ అధిష్ఠానానికి పంపుతారు. పార్టీలో చేరికలపై దృష్టి సారించాలని శివప్రకాశ్ రాష్ట్ర నేతలకు సూచించారు. చివరిదశలో బలమైన అభ్యర్థులు చేరితే వారికి అవకాశం కల్పిద్దామని నిర్ణయురచినట్లు తెలిసింది.
టీడీపీ, జనసేన తమ అభ్యర్దులను ప్రకటించటంతో బీజేపీ ఈ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పొత్తు పైన బీజేపీ ఆలోచన మారిందా..లేక, సీట్ల విషయంలో తాము కోరుకున్నవిధంగా దక్కించుకొనేందుకు టీడీపీ పై ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేస్తుందా అనే చర్చ మొదలైంది. దీంతో..ఎన్నికల వేళ పొత్తుల నిర్ణయం పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications