టీడీపీతో బీజేపీ పొత్తు పై అనూహ్య ట్విస్ట్ - ప్రధాని మోదీ ఫైనల్ డెసిషన్.!!
ఏపీలో ఎన్నికల పొత్తులు ఆసక్తి కరంగా మారుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. ఇప్పుడు బీజేపీ ఈ రెండు పార్టీలతో కలుస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. అటు కాంగ్రెస్ ఏపీలో వేగంగా ఎన్నికల దిశగా అడుగులు వేస్తోంది. దీంతో బీజేపీ అలర్ట్ అయింది. పొత్తుల విషయం తేల్చేయాలని నిర్ణయించింది. దీని పైన కేంద్ర నాయకత్వం రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయాలు సేకరించింది. ఇప్పుడు ఈ పొత్తు వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
బీజేపీ అలర్ట్ : ఏపీలో కాంగ్రెస్ కొత్త ఎత్తులతో బీజేపీ అప్రమత్తం అవుతోంది. కర్ణాటక, తెలంగాణలో వరుసగా కాంగ్రెస్ గెలుపుతో ఇక బీజేపీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తోంది. అందులో భాగంగా ఏపీలో ఒంటరిగా వెళ్లాలా..పొత్తులతో వెళ్లాలా అనే అంశం పైన కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఏపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఒంటరిగా వెళ్లడం కన్నా పొత్తుతోనే వెళ్లాలని మెజారిటీ సభ్యులు కేంద్ర బీజేపీ కోర్ కమిటీకి అభిప్రాయం వ్యక్తం చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి రాబోయే ఎన్నికలకు వెళ్తేనే మంచిదనే భావనను కొంతమంది వ్యక్తం చేశారు. మరి కొందరు తెలంగాణ తరహాలో బీసీ, కాపు వర్గాల మద్దతు నినాదాలతో ఎన్నికల బరిలోకి దిగాలని సూచన చేసారు.

ఏపీలో పొత్తులపై ఏం చేద్దాం : వైసీపీ ప్రభుత్వంలో ఇసుక, లిక్కర్ వ్యవహారాలపైన విచారణ చేయించాలని కొందరు బీజేపీ నేతలు సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో కూడా పలువురు బీజేపీని అనుమానిస్తు న్నారని కొందరు నేతలు కోర్ కమిటీకి చెప్పినట్లు తెలుస్తోంది. టీడీపీ - జనసేన పొత్తులపై రాష్ట్ర స్థాయిలో ఎవరు మాట్లాడవద్దని కోర్ కమిటీ రాష్ట్ర నేతలకు సూచించింది. అందరి అభిప్రాయాలను కోర్ కమిటీ నేతలు నోట్ చేసుకున్నారు. బీజేపీ అధిష్ఠానానికి రాష్ట్ర పరిస్థితిని వివరించి తుది నిర్ణయం వారికే వదిలేయనున్నారు. ఈ అభిప్రాయాల పైన నివేదిక ఆధారంగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించి ప్రధానికి తుది రిపోర్ట్ ఇస్తారని చెబుతున్నారు.

ప్రధాని నిర్ణయం మేరకే : ఇదే సమయంలో..ఏపీలో బీజేపీ భవిష్యత్ ఏం చేస్తే మంచిదనేది బీజేపీ నాయకత్వం కొందరు ప్రముఖుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీతో పొత్తు ఉంటే సీట్లు, పొత్తు లేకుంటే ఎలాంటి ప్రాతినిధ్యం లేకపోవటం ఏంటని తాజా ఢిల్లీ ముఖ్య నేతలు ఏపీకి చెందిన కీలక నేతను ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ సొంతంగా ఎదగాలంటే ఏం చేయాలో స్థానిక సమీకరణాలతో నివేదిక కోరినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో జనసేన మిత్రపక్షమని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని పార్టీ నేతలకు నాయకత్వం దిశా నిర్దేశం చేస్తోంది. ఇటు టీడీపీతో పొత్తుతో వెళ్లాలా వద్దా అనేది మాత్రం ప్రదాని మోదీ నిర్ణయం ఆధారంగానే ప్రకటన ఉండనుంది. దీంతో, ప్రధాని మోదీ నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications