అమరావతికి 'బ్రిటన్' నిధి, చంద్రబాబుకు 'తక్కువ', 'దీర్ఘ' ఆఫర్
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటన్ సుమారు రూ.40వేల కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనుంది. అమరావతి అభివృద్ధి నిధి పేరుతో ఇది ఏర్పాటవుతుందని తెలుస్తోంది. ఈ నిధి నుంచి అమరావతి నిర్మాణం, మౌలిక వసతుల ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రభుత్వం, ప్రయివేటు సంస్థలకు రుణాలు అందిస్తుంది.
పరిశ్రమల ఏర్పాటుకు కూడా రుణం అందిస్తుంది. అమరావతి అభివృద్ధి నిధికి లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ద్వారా బ్రిటన్ ప్రభుత్వం నిధులు సమీకరిస్తుంది. ఆ దేశంలోని సంస్థాగత మదుపుదారులు పెట్టుబడులు పెడతారు. ఈ నిధి ద్వారా సమకూరిన మొత్తాన్ని కేవలం అమరావతిలో పెట్టుబడులకు మాత్రమే బ్రిటన్ ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇందుకు సంబంధించి ప్రముఖ దినపత్రికలో కథనం వచ్చింది.
ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణ అవసరాలు, ఇక్కడి పెట్టుబడి అవకాశాలు, ప్రాజెక్టులపై అధ్యయనం చేసే బాధ్యతను ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థలు ప్రైజ్ వాటర్‌హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ), ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై)లకు ఆ ప్రభుత్వం అప్పగించింది. ఆ సంస్థల ప్రతినిధులు సీఆర్డీఏ అధికారులతో సంప్రదింపులు చేపట్టారు. బ్రిటన్‌కు చెందిన పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి.

అమరావతిపై బ్రిటన్ ప్రభుత్వం ప్రత్యేక ఆసక్తి కనబరుస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ పర్యటన సందర్భంగా భారత్‌లో ఆకర్షణీయ నగరాల అభివృద్ధిలో పాలుపంచుకుంటామని బ్రిటన్ ప్రభుత్వం చెప్పింది. ఆ సందర్భంలోనే అమరావతి ప్రస్తావన వచ్చింది.
కాగా, అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు ఏపీ ప్రభుత్వం వివిధ మార్గాలు అన్వేషిస్తోంది. తక్కువ వడ్డీకి, దీర్ఘకాలంలో తిరిగి చెల్లించే విధంగా రుణాలు ఇచ్చే సంస్థల్ని సీఆర్డీఏ సంప్రదిస్తోంది. మరోపక్క అమరావతిలో వివివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులు చేపట్టే ప్రైవేటు సంస్థలకూ నిధులు అవసరం. పరిశ్రమల ఏర్పాటు చేసేవారికీ రుణాలు కావాలి.
ఇలాంటి సమయంలో బ్రిటన్ ప్రభుత్వం ప్రత్యేకంగా అమరావతి నిర్మాణానికే ఒక నిధిని ఏర్పాటు చేయడం సానుకూల పరిణామంగా సీఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి. బ్రిటన్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అమరావతి డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి తక్కువ వడ్డీకి రుణాలు వస్తాయని, దీర్ఘకాలంలో చెల్లించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications