కాల్‌మనీ దందాలో కానిస్టేబుల్: చీరాలలో వడ్డీ వ్యాపారి తిమోతి అరెస్ట్
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్ మనీ వ్యవహారంలో బాధితులు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. తాజాగా తిరుపతిలో ఓ కానిస్టేబుల్ అధిక వడ్డీలకు అప్పులిస్తూ మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తోన్న ఘటన వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే, కొర్లకుంటకు చెందిన ఓ మహిళ తిరుపతిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వ్యక్తి వద్ద అప్పు తీసుకుంది. సదరు మహిళ నుంచి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్న కానిస్టేబుల్, అప్పు చెల్లించలేదంటూ లైంగికంగా ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.
ఐదు నెలల క్రితం అలిపిరి పోలీస్ స్టేషన్‌లో మూడు రోజుల పాటు అక్రమంగా నిర్భంధించాడు. ఆ తర్వాత భయపడిన మహిళ కుటుంబ సభ్యులు కడప జిల్లాకు పారిపోయారు. తాజాగా కానిస్టేబుల్ తనను వేధిస్తున్నాడనీ, తక్షణమే రూ. 10 లక్షలు చెల్లించాలని బెదిరిస్తున్నాడని వాపోయింది. అప్పు చెల్లించలేని పక్షంలో తన బిడ్డలను ముంబై రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడనీ బాధితురాలు వాపోయింది.

చీరాలలో వడ్డీ వ్యాపారి తిమోతి అరెస్ట్:
ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెంలలో గురువారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. కాల్‌మనీ వ్యవహారానికి సంబంధించి బాధితుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేశారు. చీరాలలో వడ్డీ వ్యాపారి తిమోతిని అరెస్టు చేశారు.
అతని వద్ద నుంచి 47 ఖాళీ చెక్కులు, 39 ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా వేటపాలెంలో వెంకటరత్నం అనే మహిళ నుంచి 32 ఇళ్ల స్థలాల పట్టాలను స్వాధీనం చేసుకుని ఆమెను అరెస్టు చేశారు.
చిలకలూరిపేటలో 5గురు వడ్డీ వ్యాపారుల అరెస్ట్
గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో ఐదుగురు వడ్డీ వ్యాపారుల పోలీసులు అరెస్ట్ చేశారు. వడ్డీ వ్యాపారుల నుంచి ప్రామిసరీ నోట్లు, చెక్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఇలా ఉంటే కాల్‌మనీ వ్యాపారులపై దాడులను నిరంతరం కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications