అమరావతి ఆందోళనలపై కేంద్రం దృష్టి .. డీజీపీ కి ఫోన్ చేసి వివరాలడిగిన కేంద్ర మంత్రి
రాజధానిగా అమరావతిని తరలించొద్దంటూ 24 రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు 25వ రోజు సైతం రాజధాని ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. నిన్నటికి నిన్న రాజధానిలో ఆందోళనలు చేస్తున్న మహిళలపై పోలీసులు దాడి చేశారని రాజధాని ప్రాంత ప్రజలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ వ్యవహారం జాతీయ మహిళా కమీషన్ దృష్టికి, కేంద్రం దృష్టికి చేరింది.

రాజధాని ఆందోళనలపై ఆరా తీస్తున్న కేంద్రం
రాజధాని మహిళలపై పోలీసులు దాడి వ్యవహారం జాతీయ మహిళా కమిషన్ దాకా చేరింది. దీంతో మహిళలపై పోలీసుల దాడిని సీరియస్ గా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా ఈ కేసును స్వీకరించి విచారణకు కమిటీని పంపిస్తోంది. ఇక ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాజధానిలో జరుగుతున్న ఆందోళనలపై, మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై దృష్టిసారించింది.

మూడు రాజధానుల ఏర్పాటు వైపే సీఎం జగన్ ..ఆందోళనలు ఉధృతం
రాజధాని అమరావతినే ఉండాలని రాజధాని ప్రాంత ప్రజలు ఆందోళన చేస్తుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల ఏర్పాటు వైపే మొగ్గు చూపుతున్నట్లుగా తాజా పరిణామాల ద్వారా స్పష్టమవుతుంది. అయితే ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయని ఏపీ సర్కార్ మౌఖిక ఆదేశాలతో రాజధాని తరలింపు ప్రక్రియ ప్రారంభించింది. ఇక ఈ నేపథ్యంలో ఏపీలో రోజు రోజుకు ఆందోళనల తీవ్రత ఎక్కువవుతోంది.

అమరావతిలో ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితులు
మరోవైపు రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో ఆందోళనలు అణచి వేయడానికి పోలీసులను మోహరించారు. జేఏసీ నేతల ర్యాలీలు, ఆందోళనకారుల అరెస్ట్‌లతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడికక్కడ అరెస్టులు, హౌస్ అరెస్టులతో, లాఠీచార్జీలు, ఉద్రిక్తతలతో రాజధాని అమరావతిలో పరిస్థితులున్నాయి.ఈ క్రమంలో అమరావతిలో పరిస్థితులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరా తీసినట్లు సమాచారం.

ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు ఫోన్ చేసి వివరాలడిగిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఈ మేరకు కిషన్ రెడ్డి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు ఫోన్ చేసి అమరావతిలో రైతుల ఆందోళనలు, మహిళలపై పోలీసుల దాడి, ఉద్రిక్త పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శాంతి భద్రతలు అదుపు తప్పకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అయితే ఏపీ మూడు రాజధానుల అంశం ఇంకా కేంద్రం దృష్టికి రాలేదని, జగన్ ఇంకా రాజధాని పై అధికారిక ప్రకటన చేయలేదని, ప్రకటన చేసిన తర్వాత స్పందిస్తానని ఇటీవల కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

25వ రోజుకు చేరుకున్న ఆందోళనలు .. భారీగా పోలీసులు
ఇక మరోవైపు అమరావతి ఆందోళనలు 25వ రోజుకు చేరుకున్నాయి. రాజధాని గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. తుళ్ళూరులో టెంట్లు వెయ్యకుండా ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుంటున్నారు. మందడం, వెలగపూడితో పాటు రాజధాని గ్రామాల్లో పోలీసులు నిరసనలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications