విజయవాడ, ఖమ్మంకు మహర్దశ
163జి పై గడ్కరీ వరాలజల్లు కురిపించారు. విజయవాడ నుంచి ఖమ్మం మధ్య ప్రయాణ సమయం కేవలం ఒక గంట లేదంటే పది నిముషాలు అదనంగా ఉండబోతోంది.
తెలంగాణలో ఉన్న జాతీయ రహదారి 163జీ పై కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వరాల జల్లును కురిపించారు. నాలుగులైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిని అభివృద్ధి చేయబోతున్నట్లు ప్రకటించారు. వి.వెంకటాయపాలెం నుంచి బ్రాహ్మణపల్లి గ్రామాల మధ్య మొదటి ప్యాకేజీలో భాగంగా ఈ నిర్మాణం చేపట్టబోతున్నట్లు ట్వీట్ చేశారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్‌లో చేపట్టే ఈ 29.92 కిలోమీటర్ల నిర్మాణానికి రూ.983.90 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల వాహన నిర్వహణ వ్యయం, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతాయని, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య రహదారి వసతులను పెంచి దక్షిణాదిలోని పోర్టులతో సెంట్రల్ ఇండియాను అనుసంధానించడమే ప్రాజెక్టు లక్ష్యంగా గడ్కరీ చెప్పారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 60 కిలోమీటర్లు, ఏపీలో 30 కిలోమీటర్లు ఈ రహదారి ఉండబోతోంది. ఇది పూర్తయితే 60 నుంచి 70 నిముషాల్లో విజయవాడ నుంచి ఖమ్మం చేరుకోవచ్చు. ఇప్పటికే రెండు విడతల్లో భూ సేకరణ కూడా పూర్తయింది. మూడో విడత భూసేకరణకు పలు ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ పనులన్నీ కొంతకాలంగా చురుగ్గా జరుగుతున్నాయి. భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా కేంద్రం దీన్ని నిర్మిస్తోంది. ఏపీలో ఉన్న పోర్టులకు తెలంగాణ, మహారాష్ట్రలను అనుసంధానం చేయడం కోసమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి.

ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి దీనిపై చొరవ తీసుకోవడంతో భారత్ మాల ప్రాజెక్టులో కేంద్రం దీన్ని చేర్చింది. ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం, చింతకాని, కొణిజర్ల, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల మీదగా ఏపీకి అనుసంధానమవబోతోంది. ఏపీ నుంచి తెలంగాణ మీదగా మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని, అక్కడి వ్యాపారాన్ని పోర్టులకు అనుసంధానం చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కారు దీన్ని నిర్మించబోతోంది.












Click it and Unblock the Notifications