హోదా ఇచ్చేది లేదు: మరోసారి తేల్చేసిన కేంద్రం, ఎందుకంటే..?
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అమల్లోకి వచ్చాక ప్రత్యేక హోదాతో పని లేకుండా పోయిందని,
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అమల్లోకి వచ్చాక ప్రత్యేక హోదాతో పని లేకుండా పోయిందని, ఇప్పటికే హోదాను అనుభవిస్తున్న 11 రాష్ట్రాలకూ ఆ ప్రాధాన్యం తగ్గిందని కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇంద్రజితసింగ్ మంగళవారం రాజ్యసభలో పునరుద్ఘాటించారు.
కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఇచ్చిన సావధాన తీర్మానానికి సమాధానమిస్తూ 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన సిఫార్సులు అమలు చేయటం ద్వారా ఆంధ్రకు ప్రత్యేక హోదావల్ల కలిగే ప్రయోజనాలు కలిగిస్తున్నట్టు బదులిచ్చారు. అయితే మంత్రి సమాధానం ఎంతమాత్రం సంతృప్తికరంగా లేదని ఎంపీ రామచంద్రరావు, సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌తోపాటు ప్రతిపక్షం నాయకుడు గులాంనబీ ఆజాద్ వ్యతిరేకించారు.

ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్టు ఆజాద్ ప్రకటించారు. రావు ఇంద్రజీత్ సింగ్ పాత సమాధానాన్నే ఇచ్చారంటూ టిఆర్ఎస్ మినహా అన్ని ప్రతిపక్షాలూ సభనుంచి వాకౌట్ చేశాయి. చివరకు తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు సైతం ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి సభనుంచి వెళ్లిపోయారు
మొదట రావు ఇంద్రజీత్ సింగ్ సావధాన తీర్మానానికి సమాధానమిస్తూ.. ఎన్డీసి స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినందున ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటాన్ని చర్చించేందుకు ఎన్డీసీని ఏర్పాటు చేయటం అసాధ్యమన్నారు. గతంలో ఎన్డీసీ 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చింది. అయితే ఆ తరువాత 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ప్రత్యేక హోదావున్న రాష్ట్రాలు, హోదాలేని రాష్ట్రాల మధ్య ఎలాంటి తేడా చూపించటం లేదని మంత్రి వివరించారు.
ప్రత్యేక హోదా ఇవ్వటంతో కలిగే ప్రయోజనాలను 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు పూర్తి చేస్తున్నందున ప్రత్యేకంగా హోదా ఇవ్వాల్సి అవసరం లేదని రావు ఇంద్రజీత్ సింగ్ స్పష్టం చేశారు. పర్వత రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాలకు ఇకపై ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని స్పష్టం చేశారు. ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యంకాదని కేంద్రమంత్రి తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications