విజయవాడకు గుడ్ న్యూస్-త్వరలో రీజినల్ పాస్ పోర్ట్ సెంటర్..!
ఏపీకి కేంద్రం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పాస్ పోర్టు సేవల్ని మరింత విస్తృతం చేసేందుకు వీలుగా మరో ప్రాంతీయ పాస్ పోర్టు కేంద్రాన్ని ప్రకటించింది. ఇప్పటికే విశాఖలో ఓ ప్రాంతీయ పాస్ పోర్టు కేంద్రం అందుబాటులో ఉండగా.. దీనికి అదనంగా విజయవాడలో మరో ప్రాంతీయ పాస్ పోర్టు సెంటర్ ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో త్వరలోనే ఈ కేంద్రం ఏర్పాటు కానుందని ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి ప్రకటించారు.
ఏపీలో ప్రస్తుతం విజయవాడలో ఓ పాస్ పోర్టు సేవా కేంద్రం అందబాటులో ఉంది. ఇందులో అన్ని పాస్ పోర్టు సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే పాస్ పోర్టు కేంద్రాల వారీగా పాస్ పోర్టు కోటా విధానం వల్ల అదనపు కేంద్రం ఏర్పాటుతో ప్రయోజనం చేకూరనుంది. అలాగే ప్రాంతీయ పాస్ పోర్టు కేంద్రం కావడంతో మరిన్ని సేవలు కూడా అందుబాటులోకి వస్తాయి. రాష్టంలో ప్రస్తుతం ఉన్న ప్రాంతీయ పాస్ పోర్టు సేవా కేంద్రానికి రోజుకు రెండు వేల అప్లికేషన్లు వస్తున్నాయి. దీంతో ఒత్తిడి పెరుగుతోంది.

ప్రస్తుతం విజయవాడలో పాస్ పోర్టు సేవా కేంద్రం బందరు రోడ్డులో ఉండగా.. ఇప్పడు కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రాంతీయ పాస్ పోర్టు కేంద్రం కూడా ఇక్కడే అందుబాటులోకి రానుంది. కోవిడ్ తర్వాత రాష్ట్రంలో పాస్ పోర్టులకు డిమాండ్ పెరుగుతోందని, దీనికి అనుగుణంగానే మరో ప్రాంతీయ పాస్ పోర్టు కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు రీజనల్ పాస్ పోర్టు అధికారి హర్ష వెల్లడించారు.
విజయవాడలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రాంతీయ పాస్ పోర్టు సెంటర్ లోనే పాస్ పోర్టుల ప్రింటింగ్ కూడా అందుబాటులోకి రానుంది. దీంతో పాస్ పోర్టులు త్వరలో జారీ చేసేందుకు వీలు కలగబోతోంది. రెండు, మూడు నెలల్లోనే ఈ సెంటర్ ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేంద్రం రాకతో విజయవాడలో పాస్ పోర్టులకు దరఖాస్తు చేసుకునే వారికి మరింత సౌకర్యంగా ఉంటుందన్నారు. కాబట్టి బ్రోకర్లను నమ్మి మోసపోవద్దని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications