రాక్షసుల్లా..., జగన్ పార్టీ రెచ్చగొట్టినా..: చంద్రబాబు నిప్పులు
హైదరాబాద్: రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయేందుకు అభివృద్ధిని ఒక యజ్ఞంలా చేస్తుంటే కొందరు రాక్షసుల్లా అడ్డుపడి ఫలితం రాకుండా చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు.
శుక్రవారం చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా పలమనేరు మండలంలో పొలం పిలుస్తోంది, నీరు - చెట్టు, బడి పిలుస్తోంది కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. బొమ్మిదొడ్డి గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొని రైతులతో మాట్లాడారు. స్వయంగా వేరుశెనగ పొలం దున్నారు. తర్వాత అక్కడికి సమీపంలోని కన్నికల చెరువులో నీరు-చెట్టు పనులను పరిశీలించారు. గ్రామస్తులతో సమావేశమయ్యారు.

పలమనేరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బడి పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు.అనంతరం బడి పిలుస్తోంది ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ రాక్షసులతో పోరాడి అభివృద్ధి యజ్ఞాన్ని జరిపిస్తానని, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి కనీసం నాలుగైదేళ్లు పడుతుందని, ఎన్నికల లోపే దానిని పూర్తి చేస్తామని చెప్పారు. ఆ లోపు పట్టిసీమ ద్వారా రాయలసీమ ప్రాంతానికి మేలు జరిగేలా చూడాల్సి ఉందని అన్నారు. అయితే పట్టిసీమతో రాయలసీమకు నీరిస్తామంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గిజగిజలాడిపోతోందని ఆరోపించారు. ఆ ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలంటూ నిలదీశారు.
ఆగస్టు 15 లోపు పట్టిసీమ పనులు పూర్తి చేయిస్తానని స్పష్టం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఎంత రెచ్చగొట్టినా విజ్ఞతతో వ్యవహరించిన రైతులు రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారని ప్రశంసించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరించకుండా మనల్ని ఇబ్బంది పెట్టేవారితో కలసి రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్నారని పరోక్షంగా వైసీపీ-టీఆర్‌ఎస్ చెలిమిపై వ్యాఖ్యలు చేశారు. డబ్బైనా అప్పు దొరుకుతుందేమో గానీ నీరు దొరకదని సీఎం అన్నారు. ఎక్కడ కురిసిన వాన నీటినే అక్కడే సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. సీమలో సబ్సిడీలతో డ్రిప్, స్ర్పింక్లర్ల సేద్యాన్ని ప్రోత్సహిస్తామన్నారు.












Click it and Unblock the Notifications