రెచ్చగొట్టొద్దు: ముద్రగడ పాదయాత్రపై చంద్రబాబు వ్యూహం ఇదీ
హైదరాబాద్: కాపునేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్రపై రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన తెలుగుదేశం పార్టీ నాయకులను ఆదేశించారు. సోమవారం పోలవరం పనులను సమీక్షించిన నేపథ్యంలో ఆయన టిడిపి ఎమ్మెల్యేలతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
రావులపాలెం నుంచి ప్రారంభం కానున్న ముద్రగడ పాదయాత్రపై ఆ ఇష్టాగోష్టి సమావేశంలో చర్చ జరిగింది. ముద్రగడ తన డిమాండ్ల కోసం పాదయాత్ర చేస్తున్నారని, కానీ మనం కాపులకు ఏం చేశామో కాపులకు తెలుసునని, అయినా మనం ఏమీ చేయడం లేదని ముద్రగడలాంటి వాళ్లు కొంతమంది మాట్లాడుతుండటం వల్ల ఏర్పడే గందరగోళాన్ని తొలగించి, వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది.
Photos: చంద్రబాబు ఏరియల్ సర్వే
ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యతను మాత్రం విస్మరించకూడదని ఆయన చెప్పారు. మనం ఏమీ చేయడం లేదనే విమర్శలపై వాస్తవాలతో ఎదురుదాడి చేయాలని, దానిపై వౌనంగా ఉండాల్సిన పనిలేదని, కానీ ఎక్కడా రెచ్చగొట్టవద్దని సూచించారు.

కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే నిర్ణయం నేపథ్యంలో బీసీలకు వాస్తవాలు వివరించాలని చంద్రబాబు నాయకులకు సూచించారు. మన పార్టీకి బీసీలే ఆధారమని,, వాళ్లు లేకపోతే పార్టీ లేదని, గత ఎన్నికల్లో బీసీలంతా పార్టీకి ఓటు వేశారని, అందుకే బీసీల కోసం అనేక పథకాలు పెడుతున్నమని ఆయన చెప్పినట్లు సమాచారం.
ఎన్టీఆర్ వచ్చిన తర్వాత బీసీల జీవితాలు ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా మెరుగుపడ్డాయని, చాలామంది కీలకపదవులు పొందారని ఆయన గుర్తు చేశారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మనం బీసీ విధానాల నుంచి వైదొలగేదిలేదని, బీసీల ప్రయోజనాలు దెబ్బతినకుండానే కాపులకు రిజర్వేషన్లు ఇస్తామంటున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications