నా జీవితంలో ఏనాడూ జైలుకు వెళ్లలేదు: చిత్తూరు సబ్ జైలులో చంద్రబాబు!
కేసులకు భయపడే ప్రసక్తే లేదని.. ప్రభుత్వం పెడుతున్న తప్పుడు కేసులు తమనేమీ చేయలేవని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సీఎం జగన్ నేర చరత్రపై పోరాటం చేస్తామని, చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న పోలీసు అధికారుల్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా జైలులో ఉన్న కుప్పం తెలుగుదేశం పార్టీ నాయకులన్ని చంద్రబాబు పరామర్శించారు.

నా జీవితంలో ఏనాడూ జైలుకెళ్లి పరామర్శించలేదు
తన రాజకీయ జీవితంలో ఏనాడూ జైలుకు వెళ్లి పరామర్శించిన దాఖలాలు లేవని, ఈరోజు జైలులో ఎనిమిది మంది కార్యకర్తలను పరామర్శించానన్నారు. కుప్పంలో అన్నక్యాంటిన్‌ను అడ్డుకోవడమే కాకుండా తమ నాయకులపైనే కేసులు పెట్టారని, జగన్మోహన్‌రెడ్డిని కూడా తరిమికొట్టే రోజు వస్తుందన్నారు. కొందరు పోలీసులు తమ విధి నిర్వహణ మరిచిపోయారని, వారికి బాధ్యతను గుర్తుచేస్తామన్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోనే కాదని పులివెందుల్లో కూడా గెలవబోతున్నామని సవాల్ విసిరారు. అసెంబ్లీ సాక్షిగా జగన్ అమరావతి, పోలవరం పై అన్నీ అబద్దాలే చెబుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

మానవ హక్కులను కాలరాస్తున్న పోలీసులు
రాష్ట్రంలోని పోలీసులు మానవ హక్కులను కాలరాసేలా ప్రవర్తిస్తున్నారని, తెలుగుదేశం పార్టీ సంపదను సృష్టించిందని, వైసీపీ మాత్రం విధ్వంసం చేస్తోందన్నారు. ఆ విధ్వంసాన్ని అడ్డుకున్నందుకు తమ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని, కేసులు పెడితే భయపడతామని జగన్ అనుకుంటున్నారేమోకానీ, దేనికీ భయపడేది లేదన్నారు. ప్రజల కోసం ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ తమదని, కొందరిపై హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేశారని, వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టడం దారుణమన్నారు. పోలీసుల్లో 90 శాతం మంచివారేనని, మిగతా 10 శాతంతోనే సమస్య వస్తోందని, చట్టవిరుద్ధంగా ప్రవర్తించే పోలీసు అధికారులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

అన్న క్యాంటిన్ ధ్వంసంతో ప్రారంభమై..
చంద్రబాబునాయుడు ఇటీవల మూడురోజులపాటు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. పర్యటన మొత్తం తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య జరిగింది. కుప్పంలో పార్టీ ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్ ను వైసీపీ వారు ధ్వంసం చేయడంతో ప్రారంభమైన వివాదం చివరకు ఆ పార్టీ నాయకులు జైలుకు వెళ్లడంతో ముగిసింది. ఇటీవలే వీరిని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. తాజాగా చంద్రబాబు వచ్చి కుప్పం పార్టీ నాయకులను పరామర్శించడంతోపాటు న్యాయ పరంగా సహాయం చేయనున్నట్లు తెలిపారు. 22వ తేదీన ముఖ్యమంత్రి జగన్ కుప్పం పర్యటించనున్నారు.












Click it and Unblock the Notifications