'వైఎస్ కూడా కుట్ర, కానీ కేసీఆర్ హద్దు దాటారు, రేవంత్ ఇష్యూ వేరు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హద్దులన్నీ దాటేశారని, గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి కూడా టీడీపీ పైన కుట్ర చేశారని, ఇప్పుడు కేసీఆర్ హద్దులు దాటాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి నిర్ణయించినట్లు సమాచారం. జెరూసలెం మత్తయ్య విజయవాడలో పెట్టిన కేసు ఆధారంగా సీఐడీ తరఫున ఈ నోటీసులు ఇవ్వాలనుకుంటున్నారు. ఎవరెవరికి ఇవ్వాలి? ఎప్పుడివ్వాలనేది కేసు పురోగతిని బట్టి నిర్ణయిస్తారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రులకు, ఇతర నేతలకు తెలంగాణ ఏసీబీ నోటీసులిస్తే ప్రతిగా ఏపీ ప్రభుత్వమూ తెలంగాణ ప్రభుత్వ ముఖ్యులకు నోటీసులివ్వాలని, వారు న్యాయస్థానం ద్వారా నోటీసులిస్తే తామూ కోర్టు ద్వారానే ఇవ్వాలని భావిస్తున్నారు.

చంద్రబాబు నేతృత్వంలో బుధవారం సచివాలయంలో ఏపీ మంత్రిమండలి సమావేశం నిర్వహించారు. ఇంతవరకూ ఎవరూ చేయనట్లుగా కేసీఆర్ హద్దులన్నీ దాటి ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. కేబినెట్లో వేం నరేందర్ రెడ్డి అరెస్టు అన్న ప్రచారం పైన కూడా చర్చ జరిగింది.
తెలంగాణ ప్రభుత్వంపై విజయవాడలో జెరూసలెం మత్తయ్య పెట్టిన కేసు, ట్యాపింగ్ తదితర అంశాలపై చర్చించారు. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, వేం నరేందర్ రెడ్డిల కేసు వేరని కానీ ఏపీ ముఖ్యమంత్రి, మంత్రులు, నేతల విషయం వేరన్న భావనను ఏపీ మంత్రులు వ్యక్తంచేశారు.
ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పరిధిలోకి రాదని, కాబట్టి వారు నోటీసులివ్వలేరన్న వాదన వ్యక్తమైంది. ఏ రోజున, ఏ సమయంలో ఫోన్లను ట్యాపింగ్ చేశారన్న పక్కా సమాచారం తమ వద్ద ఉందని చంద్రబాబు చెప్పారు. వాటిని తగిన సమయంలో బయటపెట్టాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications