Chandra Babu: "2014 రిపీట్" - తేల్చేసిన చంద్రబాబు: ఢిల్లీ పర్యటన వేళ..!!
Chandra Babu on Alliance with BJP: టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. 2014 రిపీట్ అవుతందంటూ పొత్తుల పైన పరోక్ష సంకేతాలు ఇచ్చారు. ఢిల్లీ పర్యటనకు సిద్దం అవుతున్న వేళ చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు కారణమవుతున్నాయి. పొత్తుల పై పవన్ కల్యాణ్ నుంచి స్పష్టత లేదు. బీజేపీ తమకు టీడీపీతో పొత్తు ఉండదని ఇప్పటి వరకు చెబుతున్నారు. కానీ, ఢిల్లీ అటు నుంచి బెంగుళూరు పర్యటనలకు చంద్రబాబు సిద్దమయ్యారు. దీనికి ముందు 2014 రిపీట్ చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలతో ఏపీ రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది.

2014 రిపీట్ అంటూ చంద్రబాబు..
టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా మరోసారి విరుచుకుపడ్డారు. గోదావరి జిల్లాల్లో పర్యటనల్లో భాగంగా చంద్రబాబు తాజా హెచ్చరికలు చేసారు. పోలీసుల బెదిరింపులతో..పరదాల మాటున సీఎం జగన్ జిల్లాల పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలపై కేసులు పెడితే తానున్నానంటూ భరోసా ఇచ్చారు. ఇప్పటి వరకు తన మంచి తనమే చూసారని..ఇక పై తన కఠినత్వం చూపిస్తా నని వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో 2014 పరిస్థితులు రిపీట్ అవుతాయంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. మరోసారి జగన్ కు పరాజయం తప్పదన్నారు. దీని ద్వారా చంద్రబాబు 2014 తరహాలో టీడీపీ - బీజేపీ - జనసేన కలిసి పోటీ చేస్తాయనే సంకేతాలను పరోక్షంగా ఇచ్చినట్లు కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ తో పొత్తు పైన టీడీపీ కంటే వైసీపీలో ఎక్కువగా నమ్మకం కనిపిస్తోంది. బీజేపీ గురించి స్పష్టత లేకపోయినా.. పవన్ - చంద్రబాబు పొత్తు ఖాయమనే సంకేతాల నడుమ చంద్రబాబు వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి.

ఢిల్లీ పర్యటనలో ప్రధానితో భేటీకి ప్రయత్నం
టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 5వ తేదీన రాష్ట్రపతి భవన్ వేదికగా జీ20 నాయకత్వ అంశం పైన ప్రధాని అన్ని పార్టీల అధినేతలతో సమావేశం ఏర్పాటు చేసారు. ఇందులో పాల్గొనేందుకు సీఎం జగన్ - చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇదే సమయంలో ప్రధానితో ప్రత్యేకంగా భేటీ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. కొద్ది నెలల క్రితం ఢిల్లీలో కేంద్రం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహణ పైన జరిగిన సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఇక, ఇప్పుడు ముందు రోజునే ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు.. ప్రధానితో భేటీకి అప్పాయింట్ మెంట్ కోరినట్లు సమాచారం. అయితే, ప్రధాని గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. పవన్ కల్యాణ్ తో భేటీ తరువాత జనసేనాని ఆలోచన మారిందని ప్రచారం జరుగుతున్న వేళ..తాను ప్రధానితో భేటీ అయ్యే అవకాశం వస్తే అన్ని అంశాలు చర్చించేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నారు.

జగన్ ను ఓడించేందుకు త్యాగాలకు సిద్దమంటూ
2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అవసరమైతే త్యాగాలకు సిద్దమని గతంలోనే చంద్రబాబు ప్రకటించారు. జనసేన - బీజేపీ తో పొత్తు ద్వారా వారికి సీట్ల కేటాయింపు - పదవుల విషయంలోనే ముందస్తుగా ఈ సూచనలు చేసారు. అటు పవన్ ప్రధానితో భేటీ తరువాత 2024 లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తానని చెబుతూనే..2029 ఎన్నికల గురించి ప్రస్తావించటం తో కొత్త విశ్లేషణలు తెర మీదకు వచ్చాయి. చంద్రబాబు ఇప్పుడు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తో పరిస్థితులు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయనే సంకేతాలు ఇస్తూ..అధికారం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పొత్తుల వైపు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో, ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటన తరువాత పొత్తులు - టీడీపీ అధినేత వ్యూహాల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications