ఏసీబీ కోర్టులో బెయిల్ కష్టమే ? హైకోర్టులోనే ! చంద్రబాబు లాయర్ లూథ్రా అంచనా..
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టు అయి రిమాండ్ కు పంపిన టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ కోసం ఓ పిటిషన్ దాఖలు చేసిన ఆయన లాయర్లు, కనీసం హౌస్ అరెస్ట్ కు అయినా ఇమ్మని కోరుతున్నారు. అదే సమయంలో హైకోర్టులోనూ లంచ్ మోషన్ దాఖలు చేస్తున్నట్లు చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా తెలిపారు.
విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబును నిన్న రిమాండ్ కు పంపిన నేపథ్యంలో అక్కడే బెయిల్ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంది. దీంతో చంద్రబాబు లాయర్లు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఇవాళ దీనిపై విచారణ జరగాల్సి ఉంది. అయితే అంతకుముందే సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉంది. చంద్రబాబును స్కిల్ స్కాంలో ప్రశ్నించేందుకు వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరుతోంది. దీనిపై ఏసీబీ కోర్టు ఇవాళ నిర్ణయం ప్రకటించనుంది.

అదే సమయంలో చంద్రబాబు కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతిస్తే ఆ తర్వాత బెయిల్ ఇవ్వడం కష్టం. ఒకేసారి కస్టడీ, బెయిల్ కు అంగీకరించలేరు కాబట్టి కస్టడీ విధిస్తే బెయిల్ రాదు. కాబట్టి హైకోర్టును కూడా ఆశ్రయించినట్లు చంద్రబాబు లాయర్ సిద్ధార్ద్ లూథ్రా తెలిపారు. ఏసీబీ కోర్టులో బెయిల్ లభించడం కష్టమేనని, అందుకే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు లూథ్రా వెల్లడించారు. దీంతో చంద్రబాబుకు నిన్న రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు ఇవాళ బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని ఆయన లాయర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు చంద్రబాబు బెయిల్ కు సంబంధించి ఆయన లాయర్ సిద్దార్ద్ లూత్రా మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు జైల్లో ప్రాణహాని ఉందని, ఆయన్ను జైల్లో ఉంచడం ప్రమాదకరమని లూథ్రా వెల్లడించారు. ఇదే అంశాన్ని ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో పశ్చిమబెంగాల్ మంత్రులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చంద్రబాబు బెయిల్ పిటిషన్ లో ప్రస్తావిస్తామన్నారు.












Click it and Unblock the Notifications