సీల్డ్ కవర్లో ఏముంది? అక్కడ కలకలం: నవ్వుతూ బాబు వార్నింగ్
గుంటూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎమ్మెల్యేలకు సీల్డు కవర్లో ఇచ్చిన ర్యాంకుల పైన అందరిలోను ఆసక్తి నెలకొంది. ఆ కవర్లలో ఏముంది? ఎవరికి ఏ ర్యాంక్ ఇచ్చారు? ఏ, బీ, సీ, డీగా వర్గీకరించడంతో.. ఎవరికి ఏం వచ్చిందనే ఆసక్తి అందరిలోను నెలకొంది.
సీల్డు కవర్లో ర్యాంకులతో పాటు పలు అంశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఇంఛార్జుల పని తీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా కవర్లో పొందుపరిచారు. ఆ ఎమ్మెల్యేల బలాబలాలు, సానుకూల - ప్రతికూలతను నివేదికలో చర్చించారని సమాచారం.
వారు విధులు ఎలా నిర్వహిస్తున్నారు, సమస్యల విషయంలో చొరవ చూపిస్తున్నారా అందులో పేర్కొన్నారు. కార్యకర్తలు, ప్రజలు ఎలా స్పందిస్తున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారా కూడా అందులో పేర్కొన్నారని తెలుస్తోంది.
కాగా, ఎమ్మెల్యేల పనితీరుపై గ్రేడింగ్ ఇస్తున్నారని తెలియగానే సదస్సు ప్రాంగణమంతటా కలకలం రేగింది. లోపలి నుంచి బయటకు వస్తున్న ఓ ఎమ్మెల్యేను రిపోర్టు విషయం అడిగినప్పుడు టాప్ సీక్రెట్ అనే చెప్పి మాయమయ్యారట.

మరొకరిని అడిగినా... ఎవరూ దీని విషయమై చెప్పరని వ్యాఖ్యానించారట. ఇందుకు ఓ కారణం ఉందంటున్నారు. వ్యక్తిగత నివేదికలు కాబట్టి ఎవరు లీక్ చేశారో తనకు తెలిసిపోతుందని చంద్రబాబు ముందుగానే హెచ్చరించారు. దీంతో సీల్డ్ కవర్లో ఉన్న విషయాన్ని ఎవరికీ తెలియనీయవద్దని వారు నిర్ణయించుకున్నారంటున్నారు.
జాబితాను అధికారికంగా విడుదల చేయకపోయినా ఆంతరంగిక సమావేశాల్లో ఎమ్మెల్యేలకు కొన్ని సంకేతాలు ఇచ్చారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన పదిమంది సభ్యుల కమిటీ... పరపతి మెరుగ్గా ఉన్న ఎమ్మెల్యేలను పిలిపించి వారి అనుభవాలను తీసుకుంది. అవి పనితీరు బాగాలేని ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పని కొస్తాయని చంద్రబాబు భావించారంటున్నారు.
గతంలో కూడా మంత్రులకు, ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇచ్చారు. మంత్రివర్గ సమావేశం రోజే మంత్రుల ర్యాంకులు లీక్ కావడంతో పెద్ద రచ్చ జరిగింది. వెనుకబడిన వారు లీకేజీపై గగ్గోలు పెట్టారు. దీంతో చంద్రబాబు ఈసారి ర్యాంకుల జోలికి పోలేదు.
వ్యక్తిగత రిపోర్టులు ఎవరు లీక్ చేసినా తెలిసిపోతుందని అంతర్గత సమావేశంలో హెచ్చరించారు. తర్వాత మీడియా సమక్షంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో.. ఇది మన వ్యవహారమని, మీడియా వాళ్లు అడిగితే వారిది తప్పని, మీరు చెబితే మీ తప్పని నవ్వుతూ వార్నింగ్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications