చంద్రబాబుకు బాధ్యతలను గుర్తు చేసిన వీవీ
Chandrababu Naidu: రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు దారుణంగా ఓడిపోయారు. 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీకి దక్కింది.. పట్టుమని 11 స్థానాలే.
అటు టీడీపీ- జనసేన- బీజేపీ 164 అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయం సాధించింది. టీడీపీ- 135, జనసేన- 21, బీజేపీ- 8 నియోజకవర్గాల్లో జయకేతనాన్ని ఎగురవేశాయి. తాము పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలిచి జనసేన, బీజేపీ.. సరికొత్త చరిత్రను సృష్టించాయి.

ఈ భారీ విజయం తరువాత చంద్రబాబు నాయుడికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయస్థాయి నాయకులు ఆయనకు శుభాకాంక్షలను తెలియజేస్తోన్నారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు కావడానికి టీడీపీ మద్దతు సైతం ఏర్పడటం ఈ ఎన్నికల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ క్రమంలో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు వీవీ లక్ష్మీనారాయణ తెరమీదికి వచ్చారు. చంద్రబాబుకు కొన్ని కీలక సూచనలు చేశారు. కేంద్రంలో టీడీపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు కాబోతోన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాల గురించి గుర్తు చేశారు.
ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారాయన. ప్రత్యేక హోదాను సాధించడానికి ఇదే సరైన సమయమని వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. విశాఖ రైల్వే జోన్ కేటాయించుకోవడం, ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేసుకోవాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉందని అన్నారు.
అదే సమయంలో- గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వీటన్నింటినీ సాధించుకోవడంపై చంద్రబాబు దృష్టి సారించాలని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications