ఎన్డీఏ జాతీయ కన్వీనర్‌గా చంద్రబాబు: వెదుక్కుంటూ వచ్చిన పదవి?
Chandrababu Naidu: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడుతున్న ఫలితాలు తెలుగుదేశం పార్టీలో జోష్‌ను నింపాయి. ఆ పార్టీ క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి ఇప్పటికే మూడొంతులకు పైగా సీట్లను సాధించింది ఈ రెండు చోట్ల కూడా.
ఈ నేపథ్యంలో- అనూహ్య పరిణామాలు ఏర్పాడుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నారు. త్వరలోనే ఆయన గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు. ఈ సాయంత్రం ఆయన గవర్నర్‌ను కలుస్తారని చెబుతున్నారు.

2019 నాటి ఎన్నికల కంటే కూడా దారుణ పరాజయాన్ని చవి చూసింది వైఎస్ఆర్సీపీ. కనీసం 20 సీట్లను కూడా దక్కించుకోలేనంత దీనస్థితికి చేరింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కనీసం 23 సీట్లయినా లభించాయి. అయిదు సంవత్సరాలు తిరిగే సరికి వైఎస్ఆర్సీపీ పరిస్థితి అంతకంటే దారుణంగా మారింది.
వైఎస్ జగన్ కేబినెట్‌లోని దాదాపు మంత్రులందరూ ఓటమి పాలయ్యారు. వైఎస్ఆర్సీపీ కంచుకోటలుగా భావించే నియోజకవర్గాలన్నీ కుప్పకూలిపోయాయి. వైఎస్ఆర్సీపీకి గట్టిపట్టుగా భావించే రాయలసీమ జిల్లాల్లోనూ ఆ పార్టీ అత్యంత దారుణంగా మట్టికరిచింది. ఇప్పట్లో కోలుకోలేని స్థితికి దిగజారింది.
టీడీపీ- జనసేన- బీజేపీకి కలిపి 160కి పైగా అసెంబ్లీ స్థానాలు ఇప్పటికే ఖరారయ్యాయి. కౌంటింగ్ పూర్తిగా ముగిసేసమయానికి ఈ సంఖ్య మరింత పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ వైఎస్ఆర్సీపీ నంబర్లు పాతాళానికి పడిపోతూ వచ్చాయే తప్ప ఏ స్థాయిలోనూ మెరుగుపడలేదు. కనీసం గట్టిపోటీ సైతం ఇవ్వలేకపోయింది టీడీపీ కూటమికి.
టీడీపీ సాధించిన ఈ తిరుగులేని విజయం జాతీయస్థాయిలో అందరినీ ఆకర్షించింది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా టీడీపీ మద్దతు సైతం అవసరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అటు బీజేపీ- ఎన్డీఏ కూటమి, ఇటు కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా.. చంద్రబాబు మద్దతును సాధించడానికి తమవంతు ప్రయత్నాలు మొదలు పెట్టాయి కూడా.
ఈ క్రమంలో తమకు మద్దతు ఇస్తే- చంద్రబాబుకు కీలకమైన పదవులను సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డాయి ఆ రెండు కూటములు. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న ఎన్డీఏకి చంద్రబాబు మద్దతు ఇస్తారనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఎన్డీఏ జాతీయ కన్వీనర్‌గా చంద్రబాబును నియమిస్తారనే ప్రచారం హస్తినలో జోరుగా సాగుతోంది.
జాతీయ స్థాయి రాజకీయాల్లో క్రియాశీలక పాత్రను పోషించడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. గతంలో నేషనల్ ఫ్రంట్‌కు ఆయన కన్వీనర్‌గా వ్యవహరించిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులే ఆయనను వెదుక్కుంటూ వచ్చినట్టే కనిపిస్తోంది ఈ ఘన విజయంతో.












Click it and Unblock the Notifications