చంద్రబాబు ఇక కేరాఫ్ విశాఖ : రాజధానికి కౌంటర్ స్ట్రాటజీ - కొత్త నినాదంతో పోరాటం...!!
విశాఖ కేంద్రంగా ఏపీలో రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. ఇప్పటికే వైసీపీ మూడు రాజధానుల ద్వారా ప్రతిపక్షాలను ఇరుకున పెట్టే వ్యూహం అమలు చేస్తోంది. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు దీనికి కౌంటర్ స్ట్రాటజీ అమలుకు సిద్దమయ్యారు. ఇందుకోసం విశాఖలోనే మకాం వేయనున్నారు. అక్కడి నుంచే కొత్త నినాదంతో పోరాటానికి సిద్దమయ్యారు. ఉత్తరాంధ్రలో కొద్ది రోజులుగా టీడీపీ - జనసేన లక్ష్యంగా వైసీపీ విమర్శలు చేస్తోంది. రాజధాని అంశంలో ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తోంది.

విశాఖలో చంద్రబాబు కొత్త వ్యూహం
అమరావతి మహా పాదయాత్ర ఉత్తరాంధ్రలో ప్రవేశించే వేళ..రాజకీయ పరిణామాలు ఉత్కంఠతను పెంచుతున్నాయి. విశాఖ రాజధాని డిమాండ్ తో ఏర్పాటు అయిన జేఏసీ ఈ నెల 15న గర్జన పేరున భారీ ర్యాలీకి నిర్ణయించింది. అదే రోజున జనసేన అధినేత పవన్ విశాఖ పర్యటన ఖరారు అయింది. అయితే, పవన్ పర్యటనకు అనుమతి లభిస్తుందా లేదా అనేది ఇంకా సందేహంగానే ఉంది. ఈ సమయంలోనే వైసీపీ రాజకీయానికి కౌంటర్ గా చంద్రబాబు కొత్త వ్యూహం సిద్దం చేస్తున్నారు. విశాఖ కేంద్రంగానే వైసీపీ పైన ఎదురు దాడికి నిర్ణయించారు. విశాఖను వైసీపీ ఇప్పటికే కబళించిందని ఆరోపిస్తున్నారు. దీనిని కప్పిపుచ్చుకోవటానికే రాజధానుల పేరుతో హడావుడి చేస్తుందని విమర్శిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలతో భవిష్యత్ కార్యాచరణ డిసైడ్ చేసారు.

విశాఖలోనే చంద్రబాబు మకాం
తాను విశాఖ వెళ్లనున్నట్లు వెల్లడించారు. అక్కడే ఉంటూ విశాఖ ఆస్తులను కాపాడటానికి 'సేవ్ ఉత్తరాంధ్ర' పేరుతో పోరాటం చేద్దామని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. దీని కోసం ముహూర్తం ఖరారు చేయనున్నారు. ఇప్పటికే విశాఖ రాజధాని డిమాండ్ చేస్తూ పదవులకు రాజీనామా చేస్తామంటూ వైసీపీ మంత్రులు - ఎమ్మెల్యేలు ముందుకు వచ్చారు. ఈ నెల 19న చంద్రబాబు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఆ తరువాత విశాఖకు వెళ్లనున్నారు. అమరావతితో పాటుగా మూడు రాజధానుల ద్వారా మూడు ప్రాంతాలకు న్యాయం చేయాలనేది తమ లక్ష్యంగా వైసీపీ చెబుతోంది. అమరావతి రాజధానిగా అన్ని ప్రాంతాల మద్దతు ఉందంటూ..అమరావతికి అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతుగా నిలుస్తున్నాయి. వైసీపీ మాత్రం వికేంద్రీకరణ పేరుతో ముందుకే వెళ్లాలని నిర్ణయించింది.

వైసీపీ వ్యూహాన్ని తిప్పి కొడతారా
ఈ సమయంలో.. విశాఖ రాజధాని పేరుతో నేతలు కీలక ప్రకటనలు చేస్తుండటంతో..రాజకీయంగా ఆసక్తి పెరిగింది. ఉత్తరాంధ్రలోని ఇతర పార్టీల నేతలను ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహాన్ని వైసీపీ అమలు చేస్తోంది. అయితే, అక్కడి నేతలతో చర్చల తరువాత రాజధాని అంశం ప్రస్తావన లేకుండానే..విశాఖ లో వైసీపీ ఏం చేసిందనేది ప్రచారం చేద్దామంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే, రాజధాని సెంటిమెంట్ తో వైసీపీ ముందుకు వెళ్తున్న సమయంలో..చంద్రబాబు ఎంచుకున్న నినాదం ఎంత వరకు ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. దీంతో..రానున్న రోజుల్లో విశాఖ కేంద్రంగా చోటు చేసుకొనే రాజకీయాల పైన ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications