చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు-ఎవర్నీ వదలను-మంత్రులైనా వేటు తప్పదు..!
ఈసారి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా కూల్ గా కనిపిస్తున్న సీఎం చంద్రబాబు.. ఇవాళ మాత్రం ఆగ్రహంతో ఊగిపోయారు. ముఖ్యంగా తాను మూడు రోజులుగా విజయవాడ వరద ప్రాంతాల్లో బస చేసి మరీ పర్యటనలు చేస్తుంటే అధికారులు, మంత్రులు మాత్రం సాకులు చెప్పి తప్పించుకోవడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ నిర్వహించిన సమీక్షలో అధికారులు, మంత్రుల్ని ఆయన కడిగిపారేశారు.
వరదల నేపథ్యంలో అధికారుల పనితీరుపై ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న చంద్రబాబు.. ఇవాళ వారిపై మరింత సీరియస్ అయ్యారు. వ్యవస్ధకు పక్షవాతం వచ్చిందని, అన్నీ సరిచేస్తానంటూ అధికారుల్ని హెచ్చరించారు. విపత్తు నిర్వహణలో విఫలమైతే మంత్రులపైనా వేటు తప్పదంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చేశారు. వరద సహాయక చర్యల్లో మంత్రులు కనిపించకపోవడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

బెజవాడ వరద సహాయక చర్యల్లో వైసీపీ అనుకూల అధికారులు అలసత్వం వహిస్తున్నారంటూ ఇప్పటికే మంత్రులు సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా వీఆర్ లో ఉంచిన అధికారుల్ని వరద సహాయక చర్యలకు పంపించడం వల్లే బాధితులకు ఆహార సరఫరా ఆలస్యమైందన్న ఆరోపణలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో వివాదాస్పద అధికారులకు బాధ్యతలు అప్పగించడం మంచి ఉద్దేశంతో జరిగిందా? లేక ఓవర్ లుక్‌లో అయిందా? అనేది పరిశీలిస్తున్నామని తెలిపారు. ఏ రకంగా బాధ్యతలు అప్పగించినా పని చేయాలనే మానవత్వం సదరు అధికారులకు ఉండదా? అని ప్రశ్నించారు. ఇవాళ జక్కంపూడిలో విధులు సరిగ్గా నిర్వహించని ఓ అధికారిని సస్పెండ్ చేసినట్లు చంద్రబాబు తెలిపారు.












Click it and Unblock the Notifications