ఏపీ నుంచి కొత్త కేంద్ర మంత్రులెవరు - చంద్రబాబు ఛాయిస్..!!
ఏపీలో ఎన్నికల ఫలితాల పై ఉత్కంఠ కొనసాగుతోంది. అధికారం ఎవరిదనేది ఆసక్తి కరంగా మారుతోంది. రెండు ప్రధాన పార్టీలు గెలుపు పైన ధీమాగా ఉన్నాయి. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని మూడు పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు. 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని జగన్ విశ్వాసంతో ఉన్నారు. ఈ సమయంలోనే కేంద్రంలో మోదీ మూడో సారి అధికారం ఖాయమని భావిస్తున్నారు. దీంతో, కూటమి ఎంపీల్లో కేంద్ర మంత్రి పదవిపైన ఆశలు పెరుగుతున్నాయి.
ఢిల్లీ వైపు నేతల చూపు
ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పోటీ చేసింది. ఏపీలో అధికారం ఖాయమని నమ్ముతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కూటమి నుంచి ఎవరు మంత్రులు అవుతారనే అంశం పైన సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. రాష్ట్రంలో అధికారం పైన భిన్నాభిప్రాయాలు ఉన్నా...కేంద్రంలో మోదీ మూడో సారి అధికారంలోకి రావటం ఖాయమని మెజార్టీ అభిప్రాయంగా ఉంది. అయితే, ఈ సారి టీడీపీ, జనసేన సైతం ఎన్డీఏ భాగస్వాములుగా ఉండటంతో..ఏపీ నుంచి కేంద్ర కేబినెట్ లో ఎవరికి అవకాశం దక్కుతుందనే అంచనాలు మొదలయ్యాయి. 2019-2024 వరకు కేంద్ర మంత్రివర్గంలో ఏపీ నుంచి ఎవరికీ ప్రాతినిధ్యం దక్కలేదు. దీంతో..ఈ సారి ఖచ్చితంగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.

కేంద్ర కేబినెట్ లో ఛాన్స్ కోసం
కూటమి పొత్తు లెక్కల్లో భాగంగా టీడీపీ -17, బీజేపీ -6, జనసేన -2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసింది. ఏపీ నుంచి కూటమి గెలిచే ఎంపీ స్థానాల ఆధారంగా కేంద్ర కేబినెట్ లో రెండు స్థానాల వరకు దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. అందులో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వారిలో ఒకరికి ఖాయంగా కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. అందులో పురందేశ్వరి, శ్రీనివాస వర్మ, సీఎం రమేష్, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ నలుగురిలో ఎవరు గెలుస్తారనే దాని పైన పదవి ఆధారపడి ఉంది. అదే విధంగా జనసేన నుంచి ఇద్దరు పోటీ చేసారు. అందులో ఒకరికి ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏమైనా రాష్ట్రంలో కూటమి ఫలితం అంచనాలకు భిన్నంగా ఉంటే పవన్ కు కేంద్రంలో మంత్రిగా అవకాశం ఇస్తారనే అభిప్రాయం వినిపిస్తోంది.
అవకాశం దక్కేదెవరికి
టీడీపీ నుంచి ఈ సారి ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. రామ్మోహన్ నాయుడు ఈ సారి గెలిస్తే మూడో సారి గెలిచిన ఎంపీగా టీడీపీ నుంచి ఛాన్స్ ఖాయంగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి రామ్మోహన్ కు ఇస్తే సీఎం రమేష్ కు ఛాన్స్ లేనట్లేననే భావిస్తున్నారు.అదే విధంగా లావు శ్రీక్రిష్ణదేవరాయలు, బీకే పార్దసారధి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా టీడీపీ నుంచి వినిపిస్తున్నాయి. మెజార్టీ ఎంపీ సీట్లు గెలిస్తే మూడు పార్టీలకు ఒక్కో బెర్తు కేటాయించే అవకాశం ఉంది. అయితే, రాష్ట్రంలో వచ్చిన ఫలితం..సామాజిక - ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా తుది కూర్పు ఉండనుంది. చంద్రబాబు, పవన్ సూచనల మేరకు ఏపీ నుంచి కేంద్ర మంత్రులు ఫైనల్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications