స్నేహితుడితో స్ట్రాంగ్ రూమ్‌లోకి చంద్రగిరి డీఎస్పీ, సీసీటీవీ ఫుటేజ్ దెబ్బకు బదిలీ వేటు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నాడు ఆ తర్వాత జరిగిన దారుణ ఘటనలు, దాడులు ఏపీలో ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. తాజాగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లోకి స్నేహితుడిని తీసుకువెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన చంద్రగిరి డిఎస్పిపై ఈ మేరకు వేటుపడింది.
చెవిరెడ్డి అనుచరుడిని స్ట్రాంగ్ రూమ్ లోకి తీసుకెళ్ళిన డీఎస్పీ
చంద్రగిరి డిఎస్పి శరత్ రాజ్ కుమార్ ను వేకెన్సీ రిజర్వ్ కు పంపుతూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే మే 13వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాత పద్మావతి యూనివర్సిటీ లో ఉన్న స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు డిఎస్పి శరత్ రాజకుమార్ వెళ్లారు. ఆయన స్ట్రాంగ్ వద్దకు వెళ్లే సమయంలో చెవిరెడ్డి అనుచరుడిని కూడా తనతో పాటు తీసుకువెళ్లారు.

సీసీ టీవీ దృశ్యాలతో గుర్తించిన సిట్
అయితే ఈ విషయం చంద్రగిరిలో, తిరుపతి పద్మావతి వర్సిటీలో పులివర్తి నానిపై జరిగిన దాడి ఘటనలపై, జరిగిన ఘర్షణలపై విచారణ జరుపుతున్న సిట్ బృందం సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్న క్రమంలో డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ స్ట్రాంగ్ రూమ్ లోకి వేరే వ్యక్తితో వెళ్లిన వీడియోలను గుర్తించి, జిల్లా ఎస్పీకి తెలియజేశారు. స్ట్రాంగ్ రూమ్ లోకి ప్రవేశించడం పైన జిల్లా ఎస్పీ ఆయనను ప్రశ్నించారు.
వివరణ కోరిన ఎస్పీ.. వీఆర్ కు పంపి వేటు
దీనిపై సరైన వివరణ ఇవ్వకపోవడంతో విఆర్ కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రగిరిలో జరిగిన ఘర్షణలను కంట్రోల్ చేయడంలో డిఎస్పి విఫలమైనట్టు గా గుర్తించారు. శాంతిభద్రతల పరిరక్షణలో విఫలం కావడంతో పాటు, స్ట్రాంగ్ రూమ్లోకి అనుమతి లేని వ్యక్తిని తీసుకు వెళ్లడం పైన కూడా సరైన వివరణ ఇవ్వకపోవడంతో చర్యలు తీసుకున్నారు తిరుపతి ఎస్పీ.
చెవిరెడ్డి చెప్పుచేతల్లో చంద్రగిరి డీఎస్పీ... టీడీపీ ఆరోపణ
అయితే స్ట్రాంగ్ రూమ్ వద్దకు డిఎస్పి తీసుకు వెళ్లిన వ్యక్తి చెవిరెడ్డి అనుచరుడని, అతడిని ఎందుకు తీసుకువెళ్లాడు అనేది మాత్రం dsp స్పష్టం చేయలేదు. చంద్రగిరిలో డీఎస్పీగా మూడు నెలల క్రితమే శరత్ రాజకుమార్ బాధ్యత చేపట్టారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి చెప్పు చేతల్లోనే డిఎస్పి పనిచేశారని, చంద్రగిరిలో ఎన్నికల రోజు ఘర్షణలపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడం వెనక కూడా డీఎస్పి ఉన్నారని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డీఎస్పీపై వేటు ఘటన చంద్రగిరిలో ప్రాధాన్యత
పులివర్తి నాని మీద దాడి చేసిన పరిస్థితుల వెనుక కూడా డీఎస్పీ నిర్లక్ష్యం ఉందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన సిట్ విచారణ నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గంలోని పోలీసుల తీరుపై ప్రధానంగా ఫిర్యాదులు అందాయి. ఇక తాజాగా ఈ క్రమంలో డీఎస్పీపై వేటు వేయటం చంద్రగిరిలో ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications