Chandrayaan 3: జాబిల్లిపై ల్యాండింగ్ తేదీ- సమయం ఇదే: అలా జరక్కుండా- పక్కాగా
తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో.. మరో ఘనతను సాధించింది. చంద్రయాన్ 3 రాకెట్‌ను నింగిలోకి పంపించింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగివైపు దూసుకెళ్లింది ఈ రాకెట్. 2019లో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన నేపథ్యంలో- ఈ మూన్ మిషన్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ఇస్రో.
వారి అంచనాలకు అనుగుణంగా చంద్రయాన్ 3ని మోసుకెళ్లిన రాకెట్ ప్రయాణం.. సవ్యంగా సాగింది. దశలవారీగా అన్ని రాకెట్ నుంచి విడిపడినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్, ఆల్ఫా పార్టికల్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్, లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పోక్ట్రోస్కోపీ.. వంటివి ఈ రాకెట్ పేలోడ్స్.

లాంచ్ ప్యాడ్ నుంచి దూసుకెళ్లిన కొద్దిసేపటికే ఈ ప్రయోగం విజయవంతమైంది. రాకెట్ తన పథంలోనే సవ్యంగా సాగింది. కొద్దిసేపటి తరువాత రాకెట్ నుంచి చంద్రయాన్ 3 శాటిలైట్ విడిపోయింది. చంద్రయాన్-3లో ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ ఉన్నాయి. దీని బరువు దాదాపు 3,900 కేజీలు. చంద్రుడి కక్ష్య నుంచి భూమి స్పెక్ట్రల్- పోలారిమెట్రిక్ కొలతలను అధ్యయనం చేయడానికి స్పెక్ట్రో-పోలరిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (షేప్) పేలోడ్‌ను ఈ రాకెట్‌తో పాటు పంపించారు.
చంద్రయాన్ 3 మిషన్.. ల్యాండింగ్ తేదీ వెలువడింది. ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్.. కొద్దిసేపటి కిందటే ఈ విషయాన్ని ప్రకటించారు. ఆగస్టు 23వ తేదీన సరిగ్గా సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు చంద్రయాన్ 3 జాబిల్లి మీద అడుగుపెడుతుంది. దీనికోసం చంద్రుడి దక్షిణ ధృవాన్ని ఎంచుకున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.
నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ 3 ఉపగ్రహం 42 రోజుల పాటు అంతరిక్ష ప్రయాణం సాగిస్తుంది. ప్రస్తుతం భూకక్ష్యలో ప్రరిభ్రమిస్తోన్న ఈ శాటిలైట్.. క్రమంగా చందమామ ఆర్బిట్‌లోకి ప్రవేశిస్తుంది. అనుకున్నది అనుకున్నట్లుగా.. అన్నీ సవ్యంగా సాగితే- ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 5:47 నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్ 3 ల్యాండర్.. దిగుతుంది. ఆ వెంటనే రోవర్- జాబిల్లి ఉపరితలంపై కాలు మోపుతుందని సోమనాథ్ తెలిపారు.












Click it and Unblock the Notifications