తిరుపతిలో అరుదైన ఘట్టం- ఒకే రోజు రెండు రథోత్సవాలు: కన్నులపండువ
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినం ఘనంగా ప్రారంభం అయింది. శివనామస్మరణతో మార్మోగిపోతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువపందిళ్లు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఈ తెల్లవారు జామున 6 గంటలకు సర్వదర్శనం ప్రారంభమైంది. పెద్దసంఖ్యలో భక్తులు శ్రీ కపిలేశ్వరస్వామివారిని, శ్రీకామాక్షి అమ్మవారిని దర్శించుకుంటోన్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 7 నుండి 9 గంటల వరకు భోగితేరు ఊరేగింపు వేడుకగా జరిగింది. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో రథోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. వేలాదిమంది స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆత్మ రథికుడు. శరీరమే రథం. బుద్ధి సారథి. మనస్సు పగ్గం. ఇంద్రియాలే గుర్రాలు. విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూలశరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకాన్ని బోధించే రథోత్సవం ఇది.

రథోత్సవానంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీసోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. స్వామి, అమ్మవార్లకు ఉపచారాలు పూర్తి చేశారు. సోమవారం సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు ఆర్జితసేవగా ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. గృహస్తులు (ఇద్దరు) అప్పటికప్పుడు రూ.500 చెల్లించి టికెట్ కొనుగోలు చేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు.
అదే సమయంలో శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నేడు ఎనిమిదో రోజు. ఈ సందర్భంగా ఈ ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7:45 నిమిషాలకు శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి రథోత్సవ మహోత్సవం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది.
వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణల మధ్య స్వామివారి రథం నాలుగు మాడ వీధులలో మహా వైభవంగా రథయాత్ర సాగింది. రథోత్సవం సందర్భంగా భక్తుల సందడి, ఆనందోత్సాహాలు ప్రత్యేకంగా కనిపించాయి. గోవిందుడిని స్మరిస్తూ భక్తులు రథాన్ని లాగారు. తమ కోరికలు నెరవేరాలని, ఆ దేవదేవుడి ప్రార్థించారు. దివ్య దర్శనం కోసం చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సాయంత్రం 7 నుండి రాత్రి 8 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన సోమవారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరుగనుంది.












Click it and Unblock the Notifications