ఏపీకి నూతన సీఎస్, డీజీపీ - చంద్రబాబు ఛాయిస్..!!
ఏపీకి నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి .. డీజీపీ నియామకం జరగనుంది. ఇందు కోసం సీఎం చంద్రబాబు కసరత్తు మొదలు పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం పెంచి సీఎస్ గా కొనసాగించారు. అదే విధంగా ద్వారకా తిరుమల రావును డీజీపీగా నియమించారు. ఇప్పుడు ఈ ఇద్దరి స్థానంలో కొత్తవారి ఎంపిక పైన చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో..సీనియార్టీలో ఉన్న అధికారులు చివరి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
చంద్రబాబు కసరత్తు
ఏపీకి నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియమితులు కానున్నారు. ప్రస్తుత సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఈ నెలాఖరుకి పదవీ విరమణ చేయనున్నారు. చంద్రబాబు సీఎం అయిన తరువాత నీరభ్ పదవీ కాలం పెంచేలా కేంద్రాన్ని ఒప్పంచి సీఎస్ గా బాధ్యతలు అప్పగించారు. మరోసారి పెంపుకు అవకాశం లేదు. దీంతో, కొత్త సీఎస్ గా సీనియార్టీ ఆధారంగా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ముగ్గురు అధికారులు రేసులో ఉన్నారు. వారిలో విజయానంద్, సిసోడియా, సాయి ప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కాగా, వారి పదవీ విరమణ కాలం ఆధారంగా సీఎస్ గా ఎంపిక చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.

మగ్గురిలో ఛాన్స్ ఎవరికి
అందులో భాగంగా సాయి ప్రసాద్ , సిసోడియా 1991బ్యాచ్ అధికారులు. విజయానంద్ 1992 బ్యాచ్ అధికారి. విజయానంద్ 2025 నవంబర్ లో, సాయి ప్రసాద్ 2026 మేలో పదవీ విరమణ చేయనుండగా, సిసోడియా కు 2028 జనవరి వరకు సమయం ఉంది. ఇదే సీనియార్టీ ప్రకారం శ్రీలక్ష్మీ, అనంతరాము ఉన్నా..వారికి అవకాశాలు లేవని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇక, విజయానంద్ కు ముందుగా సీఎస్ గా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు గత హయాంలోనూ, ఇప్పుడూ విజయానంద్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. తాత్కాలిక ఎన్నికల సీఈవోగానూ వ్యవహరించారు.
కొత్త డీజీపీగా
ఇక, ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. అందుకే కొత్త డీజీపీ ఎంపిక కోసం కసరత్తు మొదలుపెట్టారు. అయితే ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావునే మరికొంత కాలం ఏపీ డీజీపీగా కొనసాగించే అంశం పైన చర్చ సాగుతోంది. దీని పైన చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ద్వారకా తిరుమల రావును మరో మూడు నెలలు కొనసాగించి.. ఆ తరువాత కొత్త డీజీపీని నియమిస్తారని ప్రభుత్వంలో చర్చ సాగుతోంది. ఇదే సమయంలో కొత్త డీజీపీని నియమించాలని డిసైడ్ అయితే ముఖ్యమంత్రి సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన హరీశ్ కుమార్ గుప్తాకు అవకాశం ఇస్తారని అంచనా వేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లోనే ఈ రెండు నియామకాల పైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications