ఎంపీ మాధవ్, పద్మావతికి నో టికెట్ - అనంత లో సీఎం మార్క్ సీట్ల మార్పు..!!
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల కసరత్తు ముమ్మరం చేసారు. ఇంచార్జ్ ల మార్పు ప్రక్రియ కంటిన్యూ చేస్తున్నారు. తొలి విడతలో 11 నియోజకవర్గాల్లో మార్పులు చేసిన సీఎం జగన్.. గోదావరి జిల్లాల్లోనూ దాదాపు లిస్టు క్లియర్ చేసారు. ఇప్పుడు అనంతపురం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. పలువురికి టికెట్లు ఇవ్వటం లేదని చెబుతున్నారు. మరి కొందరికి సీట్ల సర్దుబాటు చేస్తున్నారు. దీంతో, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ పెరుగుతోంది.
ఆపరేషన్ అనంత : ముఖ్యమంత్రి జగన్ ఆపరేషన్ అనంతపురం ప్రారంభించారు. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోకవర్గాలు, రెండు ఎంపీ సీట్ల పైన సర్వే నివేదికలతో ఎంపీలు, ఎమ్మెల్యేల పని తీరు పైన సీఎం తన కసరత్తు కొనసాగిస్తున్నారు. ఎవరి పని తీరు ఎలా ఉంది. ఎవరిని తప్పించాలి. ఎవరిని ఎక్కడకు మార్చాలనేది ఒక నిర్ణయానికి వచ్చారు. సీమ జిల్లాల్లో వైసీపీ 2019 ఎన్నికల్లో కర్నూలు, కడపలో క్లీన్ స్వీప్ చేసింది. అనంతపురంలో ఉరవకొండ, హిందూపురం ఓడిపోయింది. చిత్తూరు జిల్లాలో కుప్పం కోల్పోయింది. టీడీపీకి గట్టి పట్టు ఉన్న జిల్లాకు పేరున్న అనంతపురంలో జగన్ అప్రమత్తం అయ్యారు. తమ పట్టు కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా పలువురి సీట్ల మార్పుకు సిద్దమయ్యారు. జిల్లా నేతలతో సమావేశం ఏర్పాటు చేసారు.

మార్పులు - చేర్పులు : అనంతపురం జిల్లాలో మడకశిర..కదిరి పెనుగొండ..సింగనమల రాయదుర్గం కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే లకు పిలుపు రావటంతో క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. తిప్పేస్వామి, కాపు రామచంద్రారెడ్డి, జొన్నల గడ్డ పద్మావతి, మంత్రి ఉషశ్రీ చరన్, సిద్దారెడ్డిలతో సీఎం జగన్ ఒన్ టు ఒన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ కు ఈ సారి సీటు లేదనే చర్చ పార్టీలో సాగుతోంది. మాధవ్ ను కర్నూలు జిల్లా పత్తికొండకు మారుస్తారనే వాదన ఉంది. కానీ, మారుతున్న లెక్కల్లో హిందూపురం ఎంపీగా మాజీ మంత్రి శంకర నారాయణ ను బరిలోకి దింపాలనేది జగన్ ఆలోచనగా సమాచారం. అదే విధంగా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి ఈ సారి సీటు దక్కదని తెలుస్తోంది. శింగనమల నుంచి మాదిగ వర్గానికి చెందిన రిటైర్డ్ డీఎస్పీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

వరుస నిర్ణయాలు : గోరంట్ల మాధవ్ కు ప్రత్యామ్నాయంగా జగన్ ఏం సూచిస్తారనేది చూడాలి. ఇక..ప్రకాశం జిల్లాలో మార్పుల తరువాత నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దే బాధ్యతలను సమన్వయకర్త విజయ సాయిరెడ్డికి అప్పగించారు. కొండెపి నేతలతో సాయిరెడ్డి సమావేశమయ్యారు. గోదావరి జిల్లాల్లో మార్పుల పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా ఖరారు చేసిన ఇంఛార్జ్ ల జాబితా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. విశాఖ జిల్లాలోనూ మూడు సీట్లు మారుస్తున్నట్లు సమాచారం. గెలుపే ప్రాతిపదికగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ సీట్ల మార్పులో ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీటి పైన సీట్లు కోల్పోయిన వారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications