అలైన్మెంట్ మార్పు: మెట్రో అధికారులతో కెసిఆర్(ఫొటో)
హైదరాబాద్: నగరంలోని చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, ముస్లింల ప్రార్థనా మందిరాలు, ప్రజల మనోభావాలతో ముడిపడిన చిహ్నాలకు ఏలాంటి విఘాతం కలుగకుండా మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి చేయడం ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. మంగళవారం ఆయన మెట్రో రైలు ప్రాజెక్ట్ అలైన్మెంట్ మార్పులకు సంబంధించిన సమావేశాన్ని సచివాలయంలో నిర్వహించారు.
మెట్రో రైలు ప్రాజెక్టు కోసం మొదట్లో ప్రతిపాదించిన అలైన్మెంట్లో మూడు మార్పులు సూచించినట్టు తెలిపారు. ఇటీవలే ఎల్అండ్‌టి ఛైర్మన్ ఎఎం నాయక్.. ముఖ్యమంత్రితో సమావేశమైన సందర్భంగా అలైన్మెంట్ మార్పులపై చర్చ జరిగింది. దీనికి ఎల్అండ్‌టి అంగీకరించిన నేపథ్యంలో అధికారికంగా మార్పులు సూచించడం కోసం సిఎం సమీక్ష నిర్వహించారు.
మెట్రో ప్రాజెక్ట్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో రైలు ప్రాజెక్ట్ సిఈ జియావుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఈ సందర్భంగా పాతబస్తీలో అలైన్మెంట్ మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలతో కూడిన లేఖను ముఖ్యమంత్రికి అందించారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. మెట్రో రైలు ప్రాజెక్టు కోసం మొదట్లో ప్రతిపాదించిన అలైన్మెంట్లో మూడు మార్పులు సూచించామని వెల్లడించారు. అమరవీరుల స్థూపం పవిత్రతను కాపాడేందుకు అసెంబ్లీ వెనుక భాగం నుండి మెట్రో రైలు రూట్ మార్చాలని చెప్పినట్టు పేర్కొన్నారు. సుల్తాన్ బజార్ దగ్గర కూడా మార్పును కోరుతూ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు వెల్లడించారు.
ప్రస్తుతం ఉన్న అలైన్‌మెంట్‌కు బదులు బడిచౌడి ఉమెన్స్ కాలేజీ వెనుక భాగం ద్వారా ఇమ్లిబన్‌కు చేరే విధంగా కొత్త రూట్ ఉండాలని అధికారులకు సూచించినట్టు తెలిపారు. పాతబస్తీలో ప్రస్తుతం ఉన్న అలైన్‌మెంట్ ప్రకారం మెట్రో నిర్మాణం చేపడితే ఏడు హిందూ దేవాలయాలు, 28 ముస్లిం ప్రార్థనా మందిరాలు, వెయ్యి నివాస గృహాలు దెబ్బతింటాయన్నారు. వీటన్నింటికి ఇబ్బంది కలగకుండా నిర్మాణం చేపట్టాలని అధికారులకు తెలిపారు. ఈ ప్రతిపాదినలను ప్రభుత్వం అధికారికంగా బుధవారం ఎల్అండ్‌టి కంపెనీకి అందించనుంది.
అభివృద్ధికి సహకరిస్తాం: ఎల్అండ్‌టి
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని ఎల్ అండ్ టి తెలంగాణ ప్రభుత్వానికి తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఎల్అండ్‌టి సంస్థ ఛైర్మన్ కెఎం నాయక్ ఓ లేఖ రాశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ విజన్ వల్ల తెలంగాణ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందనే ఆశిస్తున్నట్లు నాయక్ ఆ లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కోరితే అన్ని రకాలుగా సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సూరత్‌లో ఉన్న ఎల్అండ్‌టి మానుఫ్యాక్చరింగ్‌ను సందర్శించాల్సిందిగా సిఎం కెసిఆర్‌ను కెఎం నాయక్ కోరారు.












Click it and Unblock the Notifications