జగన్ సర్కార్ గుడ్ న్యూస్: వారి ఖాతాల్లో నగదు జమ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు.
గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. వరుసగా నాలుగో సంవత్సరం వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం కింద పంట నష్ట పోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని ఆయన పంపిణీ చేయనున్నారు. ఇది మూడో విడత పంపిణీ. తెనాలి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం విడుదల చేసింది.
ఉదయం 9:50 నిమిషాలకు వైఎస్ జగన్.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరుతారు. 10:15 నిమిషాలకు తెనాలికి చేరుకుంటారు. 10:35 నిమిషాలకు స్ధానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోని బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు. నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ కింద ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ మొత్తాన్ని పంపిణీ చేస్తారు. ఈ మొత్తాన్ని ఆయన బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.

బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12:45 నిమిషాలకు తెనాలి నుంచి బయలుదేరి 1:10 నిమిషాలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. నిజానికి సోమవారమే ఆయన తెనాలికి పర్యటించాల్సి ఉన్నప్పటికీ- దీన్ని ఒకరోజు వెనక్కి జరిపారు. ముఖ్యమంత్రి ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, స్థానిక వైసీపీ శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ ఆరిఫ్ హఫీజ్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణాన్ని పరిశీలించారు.
రైతులను ఇన్ పుట్ సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేయడానికి జగన్ ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా- ప్రధాని మంత్రి కిసాన్ పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద మొత్తం 58 లక్షల మందికి పైగా రైతులను అర్హులుగా గుర్తించింది. ఈ పథకం కింద ఇప్పటివరకు 19,812.79 కోట్ల రూపాయల మేర పెట్టుబడి సాయాన్ని అందించింది ప్రభుత్వం. ఒక్కో రైతుకు 13,500 రూపాయలు చొప్పున అందుతుంది.












Click it and Unblock the Notifications