కీపిటప్.. గో ఎ హెడ్: మంత్రి విడదల రజినిని మెచ్చుకున్న వైఎస్ జగన్
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ఆ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులను అభినందించారు. వారి పనితీరును మెచ్చుకున్నారు. ప్రశంసల వర్షాన్ని కురిపించారు. విడదల రజినీ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న వైద్య-ఆరోగ్య మంత్రిత్వ శాఖకు జాతీయ స్థాయిలో రెండు అవార్డులు లభించడమే దీనికి కారణం. మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన కొద్దిరోజుల్లోనే ఆ శాఖ- జాతీయ స్థాయి అవార్డులను అందుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి రజినీ, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పాల్గొన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకున్నారు. ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాల గురించి వివరించారు. ఆరోగ్య శ్రీ, హెల్త్ కార్డులు, విలేజ్ క్లినిక్స్, ఏపీ వైద్య విధాన పరిషత్‌లో డాక్టర్ల నియామకాలు, వాక్ ఇన్ ఇంటర్వ్యూలను ప్రస్తావించారు.

అలాగే- 108, 104 అంబులెన్సులు, గ్రామస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయడానికి తీసుకుంటోన్న చర్యల గురించి విడదల రజినీ ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో వెల్లడించారు. ప్రభుత్వ వైద్య రంగంలో టెలికన్సల్టేషన్‌ను అమలు చేస్తోండటం, విలేజ్ క్లినిక్స్ ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ రెండు అంశాల్లో ఈ అవార్డులను ప్రకటించింది. వారణాసిలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే వేడుకల సందర్భంగా ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా అవార్డులను అందజేశారు మన్‌సుఖ్ మాండవీయ.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం 10,032 విలేజ్ క్లినిక్‌లను నెలకొల్పుతోంది. 2.84 కోట్ల మందికి టెలి కన్సల్టేషన్ ద్వారా వైద్య సేవలను అందించింది. ఈ స్థాయిలో వైద్య సేవలను అందజేసిన రాష్ట్రం మరొకటి లేదు. ఈ కేటగిరీలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. కాగా- ఈ మధ్యాహ్నం సచివాలయంలో విడదల రజిని, కృష్ణబాబు.. ముఖ్యమంత్రిని కలిశారు. రాష్ట్రానికి వచ్చిన అవార్డులను చూపించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రిని కీపిటప్ అంటూ ప్రశంసించారు.












Click it and Unblock the Notifications