తెలంగాణపై వడివడిగా: సీమాంధ్ర నేతలు పీఛే ముడ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కి తగ్గడానికి కాంగ్రెసు అధిష్టానం ఏ మాత్రం సిద్ధంగా లేదనేది అర్థమవుతోంది. ఇదే విషయాన్ని కాంగ్రెసు అధిష్టానం పెద్దలు సీమాంధ్ర నాయకులకు చెబుతున్నట్లు సమాచారం. సీమాంధ్రకు కావాల్సిన రాయితీలను, ప్యాకేజీలను మాత్రమే అడగాలని కూడా వారు సూచిస్తున్నారు. రాష్ట్ర విభజన తుఫానును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యకు వెంటనే ఎఐసిసి అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర విభజన అంశం ముఖ్యమంత్రుల చేతుల్లో ఉండదని ఆయన చెప్పారు. ఆ రకంగా ఆయన కిరణ్ కుమార్ రెడ్డికి ఓ దమ్కీ ఇచ్చారని అంటున్నారు.
శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రతిపాదించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వేగంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. నదీ జలాల పంపకం, ఉద్యోగుల సర్దుబాటు తదితర అన్ని అంశాలను వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏ మాత్రం వెనకడుగు వేయకూడదని, ఎన్నికల లోపే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, లేదంటే దాని ఫలితం దక్కకుండా పోతుందని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది. అందుకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై అడుగులు వేస్తోందని అంటున్నారు.

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాజీనామా చేసిన 13 మంది సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల రాజీనామాలను స్పీకర్ మీరా కూమార్ తిరస్కరించారు. ఆ తర్వాత కొంత మంది పార్లమెంటు సభ్యులు రాజీనామా విషయంలో వెనక్కి తగ్గినట్లేనని భావిస్తున్నారు. అయితే, నలుగురు పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, సాయి ప్రతాప్, ఉండవల్లి అరుణ్ కుమార్, సబ్బం హరి మళ్లీ సోమవారం రాజీనామాలు చేశారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్, మేకపాటి రాజమోహన్ రెడ్డి తిరిగి రాజీనామాలు చేయడానికి సిద్ధంగా లేరనేది అర్థమవుతోంది. తాను తిరిగి రాజీనామా చేయబోనని, దాని వల్ల ఫలితం లేదని మేకపాటి రాజమోహన్ రెడ్డి సోమవారం చెప్పారు. దీన్ని బట్టి జగన్ కూడా తిరిగి రాజీనామా చేసే అవకాశాలు లేనట్లు తెలిసిపోతోంది.
కాగా, సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు మెల్లగా అసలు విషయాన్ని చెబుతూ వస్తున్నారు. మొదటి నుంచీ రాజీనామాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్న కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మరో అడుగు ముందుకు వేశారు. రాష్ట్ర విభజనకు మానసికంగా సిద్ధపడాలని ఆమె ఆదివారం చెప్పారు. సోమవారం మరో ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తాను పార్లమెంటులో ఓటు చేస్తానని చెప్పారు. రాష్ట్ర విభజనను ఆపలేమని, సీమాంధ్రకు కావాల్సినవి ఏవో రాబట్టుకోవడమే మంచిదని ఇటీవల మరో కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కూడా అన్నారు.
సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, జెడి శీలం, కిశోర్ చంద్రదేవ్ రాజీనామాలకు సిద్ధంగా లేరని అనిపిస్తోంది. సీమాంధ్రకు చెందిన ఇతర పార్లమెంటు సభ్యులు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా రాజీనామాలకు ముందుకు రాకపోవచ్చునని అంటున్నారు. పార్లమెంటులో బిల్లు వచ్చినప్పుడు ఏం చేస్తారనేది మాత్రం కొంత సందేహంగానే ఉంది.
కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడుతారని, రాష్ట్ర విభజనను అడ్డుకుంటారని కొంత మంది కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు అంటున్నారు. కానీ, కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనకు సహకరిస్తారని అధిష్టానం నమ్ముతోంది. సహకరించని పక్షంలో తమకు ప్రత్యామ్నాయం కూడా ఉందని ఆ మధ్య ఎఐసిసి నాయకుడు బహిరంగంగానే చెప్పారు.
సీమాంధ్ర ఉద్యమం కూడా తగ్గుతోందని కాంగ్రెసు అధిష్టానం అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 26వ తేదీన వైయస్ జగన్ తలపెట్టిన సమైక్య శంఖారావం సభ ఎలా జరుగుతుందనే దానిపై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. కాగా, తెలంగాణ అంశం రెండుసార్లు అసెంబ్లీకి వచ్చే అవకాశం కూడా లేదు. ఆ విషయాన్ని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కనుక్కుంటానని వ్యూహాత్మకంగానే కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ అంటున్నట్లు భావిస్తున్నారు. ముసాయిదా బిల్లును మాత్రమే రాష్ట్ర శాసనసభకు పంపించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. నిర్ణీత కాలవ్యవధిలో కచ్చితంగా రాష్ట్ర విభజనను పూర్తి చేయాలనే పట్టుదలతోనే కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications