అబద్దాలతోనే: బాబుపై ఉండవల్లి, హోదా వద్దు.. ప్యాకేజీయే: చింతా సంచలనం
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అబద్దాలతో ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని రాజమండ్రి నియోజకవర్గం మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం నాడు ఆరోపించారు.
పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేయడం విడ్డూరమన్నారు. ప్రత్యేక హోదా పైన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా నాటకాలు ఆడుతున్నాయని విమర్శలు గుప్పించారు.

గోదావరి పుష్కర ఘాట్ వద్ద జరిగిన ప్రమాదం పైన ఇంత వరకు ఎందుకు విచారణ జరగలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పుష్కర ఘాట్‌లోనే స్నానం చేశారని ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. ఇప్పటి వరకు ఈ ఘటన పైన చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు.
చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్య
ఏపీకి ప్రత్యేక హోదా వద్దని, ప్యాకేజీ కావాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదాయపన్ను ఎగ్గొట్టేందుకు 200 మంది పారిశ్రామికవేత్తలు ప్రత్యేక హోదా అడుగుతున్నారని ఆరోపించారు. వెనుకబడిన రాయలసీమకు రూ.50వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించాలని సిఎం చంద్రబాబుకు సూచించారు.












Click it and Unblock the Notifications