ఇలాకాలో తిరుగులేని ముగ్గురు, జానారెడ్డికి రెండుచోట్ల?
హైదరాబాద్/న్యూఢిల్లీ: రాబోయే సాధారణ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వారికే టిక్కెట్లు ఇవ్వాలని పార్టీ నాయకులు ఎఐసిసి పరిశీలకులకు సూచించారు. ఎన్నికల కసరత్తులో భాగంగా కాంగ్రెసు పార్టీ అధిష్టానం పరిశీలకులను రాష్ట్రానికి పంపించింది. వారు నియోజకవర్గాల్లో పర్యటించి ఆరా తీస్తున్నారు.
బొత్స(చీపురుపల్లి), కిరణ్(పీలేరు), దామోదర(ఆందోల్)లతో పాటు పలువురు మంత్రుల నియోజకవర్గాల్లోను వారికే టిక్కెట్లు ఇవ్వాలని పరిశీలకులకు సూచించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి పేరును అసెంబ్లీతో పాటు నల్గొండ లోకసభకు ప్రస్తావన వచ్చినట్లుగా తెలుస్తోంది. కామారెడ్డికి శాసన మండలి సభ్యులు షబ్బీర్ అలీ పేరును పార్టీ నాయకులు సూచించారు.

గీతా రెడ్డి, జానా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి మంత్రులకు వారి స్థానాల్లోనే టిక్కెట్ కేటాయించాలని కోరారు. గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు అటు నల్గొండ లోకసభకు, ఇటు మిర్యాలగూడ అసెంబ్లీ స్థానానికి, జానా రెడ్డి పేరను కూడా లోకసభకు, శాసన సభకు సూచించారు.
కాగా, అధిష్టానం నిర్ణయంతో ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని పలుచోట్ల జరిగిన అభిప్రాయ సేకఱణలో నేతలు పార్టీ పరిశీలకులకు తెలిపారు. సీమాంధ్ర ప్రజల ఆకాంక్షను పట్టించుకోకుండా నిర్ణయం తీసుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సహకార, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తన సత్తా చాటిందన్నారు. ఆ తర్వాత విభజనపై తీసుకున్న నిర్ణయం పార్టీకి శరాఘాతంగా మారిందన్నారు. సీమాంధ్రలో పార్టీ పని అయిపోయిందని, తెలంగాణలో మెరుగుపడుతుందనుకుంటే సరికాదన్నారు.












Click it and Unblock the Notifications