ఏపీ శాశ్వత ముఖ్యమంత్రిగా చంద్రబాబు?
Chandrababu Naidu: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడుతున్న ఫలితాలు తెలుగుదేశం పార్టీలో జోష్‌ను నింపాయి. ఆ పార్టీ క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి ఇప్పటికే మూడొంతులకు పైగా సీట్లను సాధించింది ఈ రెండు చోట్ల కూడా.
2019 నాటి ఎన్నికల కంటే కూడా దారుణ పరాజయాన్ని చవి చూసింది వైఎస్ఆర్సీపీ. కనీసం 20 సీట్లను కూడా దక్కించుకోలేనంత దీనస్థితికి చేరింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కనీసం 23 సీట్లయినా లభించాయి. అయిదు సంవత్సరాలు తిరిగే సరికి వైఎస్ఆర్సీపీ పరిస్థితి అంతకంటే దారుణంగా మారింది.

టీడీపీ- జనసేన- బీజేపీకి కలిపి 160కి పైగా అసెంబ్లీ స్థానాలు ఇప్పటికే ఖరారయ్యాయి. కౌంటింగ్ పూర్తిగా ముగిసేసమయానికి ఈ సంఖ్య మరింత పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ వైఎస్ఆర్సీపీ నంబర్లు పాతాళానికి పడిపోతూ వచ్చాయే తప్ప ఏ స్థాయిలోనూ మెరుగుపడలేదు. కనీసం గట్టిపోటీ సైతం ఇవ్వలేకపోయింది టీడీపీ కూటమికి.
టీడీపీ సాధించిన ఈ విజయం.. దేశం మొత్తాన్నీ ఏపీ వైపు చూసేలా చేసింది. అంతేకాదు- కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో టీడీపీ కీలక పాత్రను పోషించే అవకాశాన్నీ ఇచ్చింది. లోక్‌సభలో మొత్తం 22 సీట్లతో దేశంలోనే నాలుగో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించే అవకాశం కలిగింది టీడీపీకి.
తెలుగుదేశం కోసం అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటమి బేరసారాలు సాగించడం మొదలుపెట్టేశాయప్పుడే. తమకు మద్దతు ఇస్తే చంద్రబాబు, ఏపీపై వరాలు కురిపిస్తామంటూ హామీలు ఇస్తోన్నాయి. తమకు మద్దతు ఇస్తే ఎన్డీఏ జాతీయ కన్వీనర్‌గా అపాయింట్ చేస్తామంటూ చంద్రబాబుకు ఆఫర్ ఇచ్చింది బీజేపీ.
అదే సమయంలో- కాంగ్రెస్ సైతం బీజేపీతో పోటీ పడుతూ హామీలను ఇస్తోంది చంద్రబాబుకు. తమ కూటమిలో చేరితే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్.. హామీ ఇచ్చారు కూడా. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
2014 ఫిబ్రవరి 14వ తేదీన ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ సారథ్యంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. తిరుపతి సభ సాక్షిగా నరేంద్ర మోదీ సైతం ఇదే హామీ ఇచ్చినప్పటికీ- అది ఇప్పటికీ అమలు కాలేదని పేర్కొన్నారు.
ఇప్పుడు కేంద్రంలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు జైరామ్ రమేష్. ఈ విషయాన్ని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో సైతం పొందుపరిచిందని పేర్కొన్నారు. ఇది తాము ఇచ్చే గ్యారంటీగా ఆయన అభివర్ణించారు. ఈ ఆఫర్‌ను చంద్రబాబు అందిపుచ్చుకుంటారా? లేదా? అనేది చర్చనీయంశమైంది.












Click it and Unblock the Notifications