డెడ్ బాడీని డోర్ డెలివరీ చేస్తే సన్మానాలా?
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. 'ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం-ప్రజాస్వామ్య పరిరక్షణ' అశంపై జరిగిన కార్యక్రమానికి సీపీఐ, సీపీఎం, జనసేన, కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులు హాజరయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ నిరసనలు తెలపకుండా పోలీసులను కాపలా ఉంచుతున్నారని, హత్య చేసి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారని, బెయిల్ పై విడుదలైతే సన్మానాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అధికార పార్టీకి పోలీసులు లొంగిపోయి పరువు తీస్తున్నారని, వైసీపీ అరాచకాలను ఆపకపోతే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
ఒక్కఛాన్స్ అంటూ కోరితే వైసీపీకి ప్రజలు అవకాశమిచ్చారని.. దీంతో ముఖ్యమంత్రి జగన్ వ్యవస్థలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ముఖ్యమంత్రి రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని, ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తుంటే పోలీసులు అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేస్తున్నారన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన వైసీపీ విధ్వంసం.. ఇప్పటం గ్రామం వరకు కొనసాగిందన్నారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అందరూ కలిసిరావాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం విచ్చలవిడిగా మారిందని జనసేన నేత కందుల దుర్గేశ్ ఆరోపించారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న దుందుడుకు చర్యలను ప్రతిఘటించాలని, లేదంటే ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. ప్రజాశ్రేయస్సు కోసం పోరాడే రాజకీయపక్షాలతో కలిసి జనసేన పనిచేస్తుందన్నారు. రాక్షస పాలన నుంచి ప్రజలను కాపాడేందుకు అంతా కలిసి పోరాడదామని కాంగ్రెస్ నేత నరసింహారావు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications