వైసీపీ మద్దతిస్తేనే కేంద్రం గట్టేక్కేది - ఏపీ పొత్తు రాజకీయం వేళ, ఏం జరుగుతోంది..!!
కేంద్ర రాజకీయాల్లో వైసీపీ కీలకంగా మారుతోంది. ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాయి. ఇదే సమయంలో మరో కీలక బిల్లు ఇప్పుడు కేంద్రానికి ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే రాజ్యసభలో వైసీపీ కీలకంగా నిలుస్తోంది. ఏపీలో పొత్తు రాజకీయం..ఎన్డీఏ భాగస్వామిగా పవన్, టీడీపీని కలుపుకుపోవాలనే ప్రయత్నాల నడుమ ఇప్పుడు కేంద్రం వైసీపీ మద్దతు తీసుకోవటం ఆసక్తి కరంగా మారుతోంది.
వైసీపీ మద్దతు కీలకంగా : కేంద్రం పైన ప్రతిపక్షాలు అవిశ్వాసం ప్రతిపాదించాయి. లోక్ సభలో బీజేపీకి పూర్తి మెజార్టీ ఉంది. మణిపూర్ వ్యవహారం పైన ప్రధానితో మాట్లాడించటం..సమాధానం రాబట్టటమే లక్ష్యంగా ప్రతిపక్షాలు అవిశ్వాసం ప్రతిపాదించాయి. తెలంగాణ అధికార బీఆర్ఎస్ సైతం అవిశ్వాస నోటీసు ఇచ్చాయి. ముందుగా కాంగ్రెస్ ఇవ్వటంతో ఆ పార్టీ ఎంపీ ఇచ్చిన అవిశ్వాసం చర్చకు తీసుకుంటామని స్పీకర్ ప్రకటించారు.

తెలంగాణ లో బీఆర్ఎస్ , ఎంఐఎం అవిశ్వాసానికి మద్దతుగా, బీజేపీకి వ్యతిరేకంగా ఓటింగ్ చేయనున్నాయి. ఇటు ఏపీలో వైసీపీ నుంచి లోక్ సభలో 22, టీడీపీ నుంచి ముగ్గురు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోక్ సభలో వైసీపీ తాము కేంద్రానికి మద్దతుగా నిలుస్తామని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.
పొత్తు రాజకీయం వేళ : బీజేపీతో పొత్తు విషయంలో టీడీపీ వేచి చూసే ధోరణితో ఉంది. అవిశ్వాసం సమయంలో బీజేపీకి టీడీపీ మద్దతు ఖాయమనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఎన్డీఏ సమావేశానికి పవన్ ను బీజేపీ ఆహ్వానించింది. టీడీపీకి పిలుపులేదు. దీంతో, టీడీపీ కేంద్రానికి మద్దతుగా నిలవటం పైన చివరి నిమషంలో నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
ఇక, ఇదే సమయంలో కీలకమైన ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు పార్లమెంట్ ముందుకు రానుంది. ఢిల్లీలో అధికారుల నియామకాలు..బదిలీల పైన ఆర్దినెన్స్ స్థానంలో తీసుకొస్తున్న ఈ బిల్లు కేంద్రానికి ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందాలంటే వైసీపీ మద్దతు తప్పని సరి. వైసీపీకి రాజ్యసభలో ఉన్న 9 మంది ఈ బిల్లు ఆమోదంలో కీలకం కానున్నారు.

కేంద్రానికి వైసీపీ మద్దతు : ఏపీలో జగన్ లక్ష్యంగా టీడీపీ, జనసేన రాజకీయం చేస్తోంది. బీజేపీతో కలిసే ప్రయత్నాలు టీడీపీ తరపున పవన్ చేస్తున్నారు. ఈ సమయంలో కేంద్రం తమకు వైసీపీ మద్దతు ఎంత కీలకంగా ఉందో ఈ సందర్భాలు చెప్పకనే చెబుతున్నాయి. ఈ సమయంలో వైసీపీ మద్దతు బీజేపీ కోరటంతో, వైఎస్సార్సీపీ నాయకత్వం ఈ బిల్లు ఆమోదం కోసం రాజ్యసభలో కేంద్రానికి మద్దతుగా నిలవాలని నిర్ణయించింది.
టీడీపీకి రాజ్యసభ లో ఒక్కరే సభ్యుడిగా ఉన్నారు. దీంతో, ప్రస్తుతం ఏపీలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కేంద్రం నుంచి తోడ్పాటు కూడా సీఎం జగన్ కోరుకుంటున్నారు. అదే సమయంలో పొత్తుల విషయం లోనూ బీజేపీ వైఖరి పైన స్పష్టత రావాల్సింది. వైసీపీ మద్దతు తీసుకుంటూ..టీడీపీతో చేతులు కలుపుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications