రాజకీయంకోసమే: దేవినేని, రాజధాని వారిష్టం: వెంకయ్య
విశాఖ: రాజకీయ అవసరాల కోసమే పోలవరం ఆర్డినెన్స్ పైన కొందరు మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు శుక్రవారం అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. నాలుగేళ్లలో దానిని జాతికి అంకితం చేస్తామని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి రైతులకు సాగునీటి సదుపాయాన్ని కల్పించడం తమ లక్ష్యమన్నారు. పనులను పూర్తి చేయకుండానే పులిచింతలను జాతికి అంకితం చేశామని చెప్పుకుంటున్నారని విమర్శించారు.
ఈ నెల 15న పులిచింతల పనులను పర్యవేక్షిస్తామన్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. పోలవరం ముంపు ప్రాంతాలను తాము ఆదుకుంటామని చెప్పారు. యుద్ద ప్రాతిపదికన ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. రైతాంగాన్ని ఆదుకోవడమే తమ లక్ష్యమన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

రాజధాని ఎంపిక రాష్ట్రం ఇష్టం: వెంకయ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదేనని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఉండబోదని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. గురువారం శాస్త్రి భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో విచిత్రమైన పరిస్థితి తలెత్తిందని, రాష్ట్రం పేరు పాతదే అయినప్పటికీ.. అక్కడ రాజధాని లేదని, మౌలిక సదుపాయాలు లేవని అన్నారు.
ఈ నేపథ్యంలో కచ్చితంగా ఆ రాష్ట్రానికి ప్రాధాన్యం లభిస్తుందని, అయితే వంద స్మార్ట్ సిటీల్లో మొదటి సిటీగా ఆ రాజధానిని నిర్మిస్తామా? లేదా? అన్నది మాత్రం తాను చెప్పలేనన్నారు. కొత్త నగరాన్ని నిర్మించేందుకు చాలా సమయం పడుతుందన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి తాము తప్పకుండా ప్రాధాన్యం ఇస్తామన్నారు. రాజధాని నిర్మాణంపై కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పరిశీలించిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, ప్రభుత్వ ప్రతిపాదనలనూ స్వీకరిస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఒక సమావేశాన్ని ఒక్కోచోట (తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలలో) నిర్వహించాల్సిన విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో నెలకొందన్నారు. ఇప్పటి వరకు తమ తమ పనులు, డిమాండ్ల పరిష్కారం కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వా లు ఢిల్లీకి వచ్చేవని అయితే, ఇకపై ఢిల్లీయే ఆయా రాష్ట్రాల వద్దకు వెళ్లి వారి పనులు, సమస్యల్ని పరిష్కరించాలన్నది తన శైలి అని చెప్పారు.












Click it and Unblock the Notifications