తిరుమలలో రెండు గంటల ముందే అక్కడ ఉండాలి, మిస్ అయితే మళ్లీ నో చాన్స్, వేసవిలో !
తిరుమల/తిరుపతి: తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు తిరుమలకు వెలుతుంటారు. ఏ రోజు కూడా తిరుమలలో 50 వేల మంది భక్తుల కంటే తక్కువ ఉన్న సందర్బాలు చాలా అరుదు. కరోనా వైరస్ వ్యాపించిన సమయంలో, లాక్ డౌన్ టైమ్ లో తప్పా ప్రతిరోజు తిరుమలలో 50 వేల మందికి పైగానే భక్తులు ఉంటారు.
ఇక విద్యార్థులకు వరుసగా పరీక్షలు పూర్తి కావస్తున్నాయి. విద్యార్థులకు వేసవి సెలవులు రావడంతో తిరుమలకు భక్తుల రాకపోకలు లక్షల్లో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుమల వెళ్లే భక్తులు మొదట స్వామి దర్శనం టోకన్లు తీసుకుంటారు. చాలా మంది భక్తులు దర్శరం టోకన్లతో పాటు తిరుమలలో గదులు తీసుకోవడానికి పోటీ పడుతుంటారు.
తిరుమల దర్శనం టోక్లతో పాటు గదులను భక్తులు దాదాపుగా ఆన్ లైన్ లోనే బుక్ చేసుకుంటున్నారు. తిరుమలలో ఆన్‌లైన్‌లో గదులు బుక్ చేసుకున్న వారు స్వయంగా వచ్చి ఏఆర్‌పీ కౌంటర్‌లో స్కానింగ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. వారికి గది కేటాయించినట్టుగా మెసేజ్ వచ్చిన తర్వాత సంబంధిత సబ్ ఆఫీసుకు వెళ్లి గదులు పొందాలని టీటీడీ అధికారులు సూచించారు.

గదులు తీసుకోవడానికి ఇతరులు ఎవరు వచ్చినా గదులు పొందలేరని అధికారులు స్పష్టం చేశారు. నిర్ణీత సమయం లోపు రెండు గంటలు ముందుగానే గది బుక్ చేసుకున్న సంబంధిత భక్తుడు గది తీసుకోకపోతే కాలపరిమితి ముగుస్తుందని, తరువాత ఆ భక్తుడు గది తీసుకోవడానికి అవకాశం ఉండదని, ఈ విషయం గదులు బుక్ చేసుకున్న వారు కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని టీటీడీ అధికారులు అంటున్నారు.
ఎవరైనా భక్తుడు సరైన సమయంలో గది తీసుకోలేకపోతే గదికి చెల్లించిన అద్దె తిరిగి ఇవ్వబడదని, కాషన్ డిపాజిట్ మాత్రమే తిరిగి చెల్లించడం జరుగుతుందని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. గదుల కేటాయింపులో జరుగుతున్న అవకతవకలను దృష్టిలో ఉంచుకుని, మధ్యవర్తులు, దళారీలను కట్టడి చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా గదులు అందుబాటులో ఉంచేందుకు వీలుగా ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ప్రవేశపెట్టడం జరిగిందని ఇప్పటికే టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి వివరించారు.

శ్రీవారి భక్తులు గదులు పొందే సమయంలో వారి ఫొటోను పొందుపరుచుకొని, తిరిగి గది ఖాళీ చేసే సమయంలో ఆ ఫొటోను సరిచూసుకొని మాత్రమే కాషన్ డిపాజిట్ ఇవ్వడం జరుగుతుందని, ఇందులో ఎలాంటి రాజీ ఉండదని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. ఈ విధానం వల్ల గదులు త్వరగా ఖాళీ అవడమే కాకుండా భక్తులకు గతంలో కంటే మరిన్ని ఎక్కువ గదులు కేటాయించే అవకాశం కలుగుతోందని టీటీడీ అధికారులు అంటున్నారు.
అందువలన తిరుమలలో గదులు బుక్ చేసుకున్న భక్తులు రెండు గంటల ముందే సంబంధిత కార్యాలయాల దగ్గరకు వెళ్లి వారికి కేటాయించిన గదులు తీసుకుంటే వేసవిలో ఎలాంటి సమస్యలు లేకుండా తిరుమల ప్రయాణం పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లే భక్తులు ఈ విషయం గుర్తు పెట్టుకుంటే వాళ్లకే మంచిదని టీటీడీ అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications