ఏపీలో మహిళల మిస్సింగ్ లెక్కలపై డీజీపీ క్లారిటీ..!!
ఏపీలో మహిళల అదృశ్యంపై డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఏపీలో మహిళల అదృశ్యంపై జనసేనాని పవన్ ఆరోపణలు సంచలనంగా మారాయి. దీని పైన ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ఏపీలో మహిళల అదృశ్యం వెనుక వాలంటీర్లు ఉన్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఇదే అంశం పైన పార్లమెంట్ లో కేంద్రం లెక్కలు వెల్లడించింది. డీజీపీ అసలు లెక్కలను వెల్లడించారు.
లెక్కలపై డీజీపీ క్లారిటీ : రాష్ట్రంలో ముప్పై వేల మంది మిస్సింగ్ అయింది అవాస్తవమని డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి స్పష్టం చేసారు. ఆరోపణలు చేసే ముందు నివేదికలు చూసి మాట్లాడాలన్నారు. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం 26వేల మంది మిస్ అయినట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు. అదృశ్యం అయిన మహిళలు 2,700 మంది మాత్రమేనని..వారిని కూడా గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. మిస్సింగ్ అయిన వారిలో 23, 354 మందిని గుర్తించామని వెల్లడించారు. వివిధ కారణాల రిత్యా మిస్సింగ్ కేసులు నమోదు అవుతున్నాయని డీజీపీ చెప్పుకొచ్చారు.

పోలీసులు ప్రత్యేక దృష్టి : ఏ కేసు నమోదైనా దాన్ని గంజాయికి ముడిపెట్టడం సరికాదని డీజీపీ వ్యాఖ్యానించారు. 7,500ఎకరాల్లో గంజాయి సాగు చేస్తే గుర్తించి నిర్మూలించామని చెప్పారు. గంజాయి కేసులు నమోదు అయితే వాటి మూలాలను వెతుకుతున్నామని డీజీపీ వివరించారు. వైజాగ్ లో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించడంతో అక్కడి నుంచి సరఫరా జరగడం లేదని స్పష్టం చేసారు. ఒరిస్సా నుంచి గంజాయి సరఫరా అవుతోందని వెల్లడించారు. అందుకే చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత నాలుగేళ్ళ తో పోలిస్తే ఆరు నెలల కాలంలో క్రైమ్ బాగా తగ్గిందని వివరించారు. రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదానికి గల కారణాలను గుర్తించామని డీజీపీ పేర్కొన్నారు.

ప్రత్యేక చర్యలు : 36శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గాయని డీజీపీ చెప్పారు. వరకట్న వేధింపుల కేసులో కూడా చాలా తగ్గుముఖం పట్టాయన్నారు. దిశా స్టేషన్ ల ఏర్పాటుతో మరింత పురోగతి సాధించామని డీజీపీ చెప్పారు. బాపట్ల, ఒంగోలులో యాదృచ్చికంగా జరిగిన ఘటనలుగా పేర్కొన్నారు. అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. సైబర్ క్రైమ్ అదుపులోకి పెట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్టేషన్ లను ఏర్పాటు చేసామని డీజీపీ వివరించారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. సోషల్ మీడియా గ్రూప్ లను మానిటర్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications