మందుబాబుకు దీపావళి బొనాంజా ఆఫర్
ఏపీలో మద్యం విధానం రూపురేఖలు పూర్తిగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరిన తర్వాత ప్రయివేటు వ్యక్తులకు లిక్కర్ షాపులను అప్పగించింది. గత ప్రభుత్వ హయాంలో మద్యానికి సంబంధించిన కుంభకోణాలపై దర్యాప్తు జరుగుతోంది. కొత్త విధానంతో మద్యం పాలసీ వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ లాటరీ విధానంద్వారా షాపులు పొందినవారు వాటిని ఏర్పాటు చేసుకున్నారు. తమ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు పెంచుకునేందుకు వివిధరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నారు.
సీసా కొంటే ఇవి కూడా ఉచితం
ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా రాజంపేటలో మద్యం ప్రియులకు దీపావళి బొనాంజా ఆఫర్ ప్రకటించారు బార్ అడ్ వైన్ షాప్స్ యజమానులు. మద్యం సీసా కొంటే ఉడకబెట్టిన కోడిగుడ్డు, మద్యం తాగడానికి ఓ గ్లాసు, మంచినీళ్ల ప్యాకెట్ ఉచితమని ప్రకటించారు. ఈ వివరాలన్నీ తెలియజేస్తూ బ్యానరును ఏర్పాటు చేశారు. మందుబాబులు మాత్రం తమకు ఒకరోజు ముందుగానే దీపావళి వచ్చిందంటూ సంబరాలు చేసుకుంటున్నారు. వాస్తవానికి వైన్ షాపులో మద్యం కొనుగోలు చేస్తే ప్లాస్టిక్ గ్లాసుతోపాటు అన్నీ మందుబాబులే కొనుగోలు చేసుకోవాలి. ఈ ఆఫర్ ను దీపావళి వరకే ఉంచుతారా? లేదంటే కొంతకాలం పొడిగిస్తారా? అనేది చూడాలి.

షాపు లైసెన్స్ రద్దు
గత ప్రభుత్వ హయాంలో అభాసుపాలైన మద్యం విధానాన్ని తిరిగి పట్టాలెక్కించాలని, ప్రభుత్వానికి మంచి ఆదాయాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మద్యం షాపులను ప్రయివేటు వ్యక్తులకు కేటాయించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే సొంతంగా మద్యం దుకాణాలు నిర్వహించిందికానీ డిజిటల్ పేమెంట్లను ప్రవేశపెట్టలేదు. కేవలం క్యాష్ తీసుకునేది. దాన్ని సవరించి ప్రతి షాపులో డిజిటల్ పేమెంట్స్ ఉండేలా ప్రభుత్వం చూస్తోంది. మద్యం విధానం అత్యుత్తమంగా రూపొందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. షాపుల్లో ఎవరైనా ఎమ్మార్పీ ధరపై ఒక్క రూపాయి అదనంగా అమ్మినా రూ.5 లక్షల అపరాధ రుసుం విధిస్తామని, తర్వాత కూడా పట్టుబడితే లిక్కర్ షాపు లైసెన్స్ ను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ మద్యం కుంభకోణంపై ప్రస్తుతం సీఐడీ దర్యాప్తు చేస్తోంది.












Click it and Unblock the Notifications