తప్పించుకుని నెట్టేయడమే: కెసిఆర్‌పై అరుణ ఫైర్
హైదరాబాద్: గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు ఆర్డినెన్స్ బిల్లు విషయంలో కాంగ్రెసు తెలంగాణ నాయకురాలు, మాజీ మంత్రి డికె అరుణ తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తీవ్రంగా మండిపడ్డారు. కెసిఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పోలవరాన్ని అడ్డుకునేందుకు కేంద్రంతో మాట్లాడతామని, అఖిలపక్ష నాయకులతో కలిసి ఢిల్లీ వెళతామని అసెంబ్లీలో ప్రకటించిన కెసిఆర్ ఆ పని ఎందుకు చేయలేదని మాజీ మంత్రి ఆమె ప్రశ్నించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. పోలవరంపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిందని తప్పు పట్టారు. ఎంతసేపటికి ఇతరులపైకి నెట్టేసే ధోరణిని కెసిఆర్ అనుసరిస్తున్నారని ఆమె విమర్శించారు.

పోలవరంపై పార్లమెంట్ సమావేశాల సమయంలో అఖిలపక్షం ఢిల్లీకి వెళ్లి, ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కలిసి సమస్య వివరిస్తామని తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అందరూ మాట్లాడడం జరిగిందని, దానికి అనుగుణంగా పరిణామాలు జరగలేదని అరుణ అన్నారు. ఎంతసేపు ఇతరులపైకి తోసివేసి, తప్పించుకునే ధోరణి తెలంగాణ ప్రభుత్వంలో కనిపిస్తోందని ఆమె విమర్శించారు.
కాంగ్రెస్ వాళ్లు ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని అడగాలని, ఆమె ఇంటి వద్ద ధర్నా చేయాలని తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్నారని డి.కె. అరుణ విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీకి వెళ్లి, అక్కడ ప్రముఖ నేతలను కలిసి పోలవరాన్ని అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదని ఆమె అడిగారు.












Click it and Unblock the Notifications